ఇది నవభారత బడ్జెట్‌: లక్ష్మణ్‌ 

Telangana BJP Leaders Response Over Union Budget 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నవభారత నిర్మాణం కోసం ఉద్దేశించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. శనివారం ఇక్కడ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌లో తాజా కేంద్ర బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. లక్ష్మణ్‌ మాట్లాడుతూ నోట్లరద్దు, జీఎస్టీ వల్ల కోటిమంది అదనంగా ఐటీ పరిధిలోకి వచ్చారని, ఆదాయపన్ను ద్వారా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. కోటి 53 లక్షల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. డబుల్‌బెడ్‌ రూమ్‌ పథకం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ   రక్షణ రంగానికి మొదటిసారిగా రూ.మూడు లక్షల కోట్ల భారీ కేటాయింపులు జరిగాయన్నారు. 

ఇది పీపుల్స్‌ బడ్జెట్‌ 
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూలేని విధంగా ఐదేళ్లకోసారి జరిగే సర్వే ఇప్పుడు క్వార్టర్లీగా జరుగుతోందంటూ దాని లాభాలను వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ను పీపుల్స్‌ బడ్జెట్‌గా అభివర్ణించారు. 33 కోట్ల కుటుంబాలకు ఈ బడ్జెట్‌ లాభదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ జనాకర్షణ, శాస్త్రీయత రెండూ సమపాళ్లలో ఉన్నాయని, ఇదొక ప్రాక్టికల్‌ బడ్జెట్‌ అని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లం తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top