మాకు అన్యాయం జరిగితే ఖబడ్దార్‌

Telangana BCs Seek Permanent Solution To Reservation - Sakshi

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలి: ఆర్‌.కృష్ణయ్య

ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి విడనాడకపోతే తడాఖా చూపిస్తాం  

పంచాయతీరాజ్‌ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీల సమావేశం  

హాజరైన బీజేపీ, సీపీఐ, టీడీపీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతం పెంచాలని తాము పోరాడుతుంటే ప్రభుత్వం మాత్రం 34 నుంచి 27 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ వ్యతిరేక వైఖరిని విడనాడకపోతే ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష పార్టీల సమావేశం సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ, 70 ఏళ్లుగా బీసీలకు దక్కాల్సిన రాజకీయ వాటాను అగ్రకులాలే అనుభవిస్తున్నాయని, ఇప్పుడు బీసీలకు జనాభా దమాషా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీసీలు సర్పంచులైతే వీళ్ల జాగీర్లు పోయినట్టు జడ్జిమెంట్‌ ఇప్పించారని మండిపడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 28 మంది అగ్రకులాల వారే ముఖ్యమంత్రులు అయ్యారని, తాము కనీసం సర్పంచ్‌లు అవుతామంటే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే సుప్రీంలో స్టే వచ్చేలా వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈసారి బీసీల వాటా బీసీలకివ్వాల్సిందే, అదేమీ భిక్ష కాదని, ప్రజాస్వామిక హక్కు అని పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  

బీసీలను కేసీఆర్‌ మోసం చేశారు: ఉత్తమ్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీలను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపుల నుంచి పంచాయతీరాజ్‌ రిజర్వేషన్ల వరకు అదే వైఖరి అవలంబించారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు.

బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి అసలు విషయాల్లో బీసీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఆమోదించే సమయంలో కాంగ్రెస్‌ పార్టీని అసెంబ్లీ నుంచి గెంటివేశారని, బీసీ ఓట్ల గణన కూడా సరిగా చేయలేదన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన 37 మందిలో 27 మంది బీసీలే ఉన్నారని, టీఆర్‌ఎస్‌లో అది సాధ్యమవుతుందా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ కుట్ర పూరితంగా కొన్ని ఉత్తర్వులు ఇస్తారని, ఆ ఉత్వర్వులను కోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. బీసీలకు పంచాయతీరాజ్‌లో 54 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తే తాము సంపూర్ణ మద్దతిస్తామన్నారు.

ఎన్నికల వాయిదాకు కేసీఆర్‌ కుట్ర...
పంచాయతీ ఎన్నికల వాయిదాకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఆరోపించారు. కోర్టులో ప్రభుత్వం తరఫున సరైన వాదనలు కూడా వినిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ అంశంలో ప్రథమ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇందుకు టీఆర్‌ఎస్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు.

బీసీల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. సమావేశంలో బాలమల్లేశ్‌ (సీపీఐ), బీజేపీ రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీల నేతలు హాజరై తమ మద్దతు ప్రకటించారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top