ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!

TDP MLAs Over Action In Vishakapatnam - Sakshi

చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య.. జీవీఎంసీలో కొందరు అధికారుల ‘పచ్చ’పాత కుట్రలతో  ఎన్నికల్లో గట్టెక్కామనిపించుకున్న టీడీపీ నగర ఎమ్మెల్యేలు తమ పాత శైలినే అందిపుచ్చుకుంటున్నారు. తమ ట్రేడ్‌మార్క్‌ వెర్రివేషాలు, విన్యాసాలు మళ్లీ మొదలెట్టేశారు. అందులోనూ వెలగపూడి, వాసుపల్లిల ఓవర్‌ యాక్షన్‌ ఏపాటిదో నగర ప్రజలకు తెలియంది కాదు. ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడే వెలగపూడి..చీప్‌ ట్రిక్కులు, చిల్లర వేషాలతో వాసుపల్లి చేసే విన్యాసాలు నగర ప్రజలకు కొత్తకాదు. అధికార మదంతో ఇప్పటివరకు విర్రవీగిన వీరిద్దరినీ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నుంచైనా ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తారని, ప్రజలతో మమేకమవుతారని అందరూ ఆశించారు. కానీ తమ నైజం మారలేదని వారిద్దరు శనివారం నిరూపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ప్రజాక్షేత్రంలోకి రాని.. వారి సమస్యలు పట్టని వీరు.. తమ అధినేతను ఎక్కడో ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసి అవమానించారంటూ గగ్గోలు పెడుతూ.. వీరావేశంతో చొక్కాలిప్పి గంతులేశారు.

సాక్షి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే అదేదో మహాఅపరాధంలా టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై  విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌)తోపాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేతలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండని స్పష్టం చేశారు. పౌర విమానయాన శాఖ గైడ్‌లైన్స్‌ ప్రకారం విమానాశ్రయాల్లో చెక్‌ ఇన్‌ వద్ద తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రముఖుల జాబితా కూడా బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయినా సరే టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో చంద్రబాబుకు అన్యాయం, అవమానం జరిగిందంటూ ఊదరగొడుతూ వచ్చాయి. ఇక విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లిలైతే శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎయిర్‌పోర్ట్‌ నిబంధనలు తెలియని పార్టీ శ్రేణులకు సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యేలే చొక్కాలిప్పేసి, గొంతుచించుకుని గగ్గోలు పెట్టారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ చీప్‌ ట్రిక్స్‌ మొదలెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును నిబంధనల మేరకు తనిఖీ చేసి అవమానించారని గొంతు చించుకుంటున్న  టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిబంధనలను గౌరవించి.. విమానాశ్రయాల్లో తనను తనిఖీ చేసేందుకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ.. టీడీపీ ఎమ్మెల్యేల వెకిలి వేషాలను ఏవగించుకుంటున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top