
ఓటింగ్ అనగానే గుర్తు వచ్చేది స్వస్తిక్ గుర్తు. బ్యాలెట్ పేపర్‌పై మనకు ఇష్టం వచ్చిన అభ్యర్థి ఎన్నికల గుర్తుపై ఇదే ముద్రవేసేవాళ్లం. దీన్ని 1962 ఎన్నికల సందర్భంగా తొలిసారి ఉపయోగించారు. అంతకుముందు 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ.. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ స్వస్తిక్ లేకుండానే ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థికి ఒక బ్యాలెట్ బాక్స్ (డబ్బా) ను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసేవారు.
ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పెట్టెలో బ్యాలెట్ పేపర్‌ను వేసేవారు. ఈ విధానంలో చెల్లని ఓట్లు ఉండేవి కావు. ఈ రెండు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తక్కువగా ఉండడంతో ఆ విధానంతో సర్దుకు పోయినా రాను రాను ఎన్నికల బరిలో నిలబడే వారి సంఖ్య పెరగడంతో స్వస్తిక్ గుర్తును వాడుకలోకి తెచ్చారు. 1999 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈవీఎంలు వచ్చాయి.