కారెక్కిన సునీతా లక్ష్మారెడ్డి

Sunitha Laxma Reddy Joined In TRS  - Sakshi

సాక్షి, మెదక్‌: మెతుకుసీమ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇందిరాగాంధీ ఇక్కడి లోక్‌సభ నుంచి బరిలో నిలిచి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టారు. అలాంటి జిల్లాలో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధానంగా ‘గులాబీ’ ఆకర్ష్‌తో విలవిల్లాడుతోంది. బడా నేతల నుంచి మొదలు దిగువ శ్రేణి నాయకుల వరకు చేయిచ్చి కారెక్కతుండడంతో కాంగ్రెస్‌ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌), స్టార్‌ క్యాంపెయినర్, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్, మెదక్‌ ఎమ్మెల్యేలు చిలుముల మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు షాక్‌ అనే చెప్పొచ్చు. కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆమె పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌ ఖాళీ అయినట్లేననే చర్చ జోరుగా సాగుతోంది.

అనుచరగణంతో సహా..
సునీతారెడ్డి 1999లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థి, దివంగత చిలుముల విఠల్‌రెడ్డిపై విజయం సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో్ల వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధిం చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూ శారు. అనంతరం మెదక్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి మదన్‌రెడ్డి చేతిలోనే ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి, రోçశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడమేకాదు రాష్ట్ర మహిళాæ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, కన్వీనర్‌గా పార్టీకి సేవలందించారు. కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఆమె సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. సునీతలక్ష్మారెడ్డితోపాటు నర్సాపూర్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సైతం ఆమె వెంటే నడిచారు. ‘గులాబీ’ తీర్థం పుచ్చుకున్న వారిలో యువజన కాంగ్రెస్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ రజని, పలు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు సత్యనారాయణగౌడ్, సూరారం నర్సింహులు, అహ్మద్, యాదా గౌడ్, ఎల్లం, నర్సింçహారెడ్డి,  హన్మంతరెడ్డి, ప్రవీణ్‌ తదితరులతోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.

చంద్రపాల్‌తోపాటు..
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మెదక్‌ మున్సిపాలిటీ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. 38 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు విశేష సేవలందించిన ఆయన తగిన గుర్తింపు లేదని కొన్నాళ్లపాటు మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని టీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి తదితరుల సమక్షంలో ‘గులాబీ’ కండువా కప్పుకొన్నారు. ఆయనతోపాటు పట్టణం, వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, సర్పంచ్‌లు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్‌ ఇక కనుమరుగైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైరాశ్యం
ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు వలస బాట పట్టారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పార్టీలో ఉన్న నేతలు కూడా శ్రేణుల్లో ధైరాన్ని నింపే ప్రయత్నం చేయకపోవడంతో వారి చూపు ఇతర పార్టీల వైపు ఉన్నట్లు తెలుస్తోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top