ఏకకాల ఎన్నికలు లాభమా, నష్టమా ! | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 30 2018 2:34 PM

Special Story on Jamili Elections - Sakshi

సాక్షి వెబ్‌ ప్రత్యేకం : లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం మంచిదని, తద్వారా ఎంతో సమయం, ఖర్చు కలసివస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం నాడు పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సూచించారు. ఈ అంశంపై చర్చించాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపు కూడా ఇచ్చారు. ఇక మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని ఎప్పటి నుంచో పదే పదే చెబుతున్నారు. గత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఓ గురుపూజోత్సవ కార్యక్రమంలో ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ మాటకొస్తే బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. సాక్షి ప్రత్యేకం. అంతెందుకు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి 1999లో లా కమిషన్‌ సమర్పించిన తన 170వ నివేదికలో కూడా ఈ ప్రతిపాదన ఉంది. అయినప్పటికీ ఈ అంశంపై ఇప్పటివరకు ఇటు పాలకపక్షంగానీ, అటు ప్రతిపక్షంగానీ సీరియస్‌గా చర్చలు జరిపిన దాఖలాలు లేవు. 

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో...
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగేవి. 1952లో మొట్టమొదటిసారి జమిలి ఎన్నికలు జరగ్గా, 1957, 1962, 1967లలో కూడా అదే సంప్రదాయం కొనసాగింది. 1968లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, 1969లో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు అర్ధంతరంగా రద్దవడంతో అవి లోక్‌సభ ఎన్నికలతో వేరుపడ్డాయి. 1970లో లోక్‌సభ గడువు తీరకముందే రద్దవడం, 1971లో లోక్‌సభకు ఎన్నికలు జరగడంతో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సైకిల్‌ పూర్తిగా మారిపోయింది. 

ఏకకాల ఎన్నికలు సాధ్యమేనా?
ఎప్పుడైనా లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపాలి.సాక్షి ప్రత్యేకం. మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలను వెనక్కి జరపాలి. అలా చేయడం వల్ల భారత రాజ్యాంగం సూచిస్తున్న ఐదేళ్ల అసెంబ్లీల కాల పరిమితి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతుంది. అది రాజ్యాంగ ఉల్లంఘన కాకుండా ఉండాలంటే రాజ్యాంగంలో సవరణ తీసుకరావాలి. 

ఏకకాల ఎన్నికలతో లాభాలేమిటీ?
1. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతి ఏటా ఎక్కడో చోట ఎన్నికలు నిర్వహిస్తూ పోవడం కన్నా ఐదేళ్లకోసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలి ఎన్నికలు నిర్వహించడం ఎంతో ఖర్చు కలసి వస్తుంది.సాక్షి ప్రత్యేకం. ఏకకాల ఎన్నికలకు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది. కానీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు 3,426 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఓ లోక్‌సభ ఎన్నికలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చవడం ఇదే మొదటిసారి. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు 1,483 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 
2. పదే పదే ఎన్నికలు నిర్వహించాల్సి రావడం వల్ల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. సాక్షి ప్రత్యేకం. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు కొత్తగా ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను చేపట్టకూడదు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టరాదు. పర్యవసానంగా అభివద్ధి కుంటుపడుతుంది. 
3. తరచూ ఎక్కడో చోట ఎన్నికలు నిర్వహించాల్సి రావడం వల్ల సాధారణ పౌరజీవనం స్తంభించి పోతుందని, రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనల వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులే కాకుండా కాలుష్యం పెరుగుతోందన్నది నిపుణుల వాదన. ఏకకాల ఎన్నికల వల్ల ఓ ప్రణాళికా ప్రకారం ఈ ఇబ్బందులను తగ్గించవచ్చన్నది వారి అభిప్రాయం. 

నష్టాలు లేదా సమస్యలేమిటీ?
1. ఏకకాల ఎన్నికల విధానం కొనసాగాలంటే లోక్‌సభగానీ, అసెంబ్లీలుగానీ నిర్దిష్ట కాలపరిమితిలోగా రద్దు కాకుండా చూసుకోవాలి. అందుకు అనువుగా రాజ్యాంగంలో సవరణలు తీసుకరావాలి. కాలపరిమితిలోగా సభ రద్దు కాకూడదంటే అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకూడదు.సాక్షి ప్రత్యేకం. అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అనుమతిస్తే ప్రభుత్వం కూలిపోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు రాష్ట్రపతి పాలన విధించాలి. ఎన్నికల జరిగిన రెండేళ్లలోపే ప్రభుత్వం పడిపోతే....అందుకు ప్రత్యామ్నాయ చర్యలను ఆలోచించాలి. 
2. ఏకకాల ఎన్నికలు నిర్వహించినట్లయితే కేంద్ర సమస్యలు, విధానాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి. రాష్ట్ర లేదా ప్రాంతీయ సమస్యలకు అంతగా ప్రాధాన్యత లభించదు. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. 
3. కేంద్రంలో గెలిచే పార్టీకే రాష్ట్రంలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  1999 నుంచి ఇప్పటి వరకు లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేంద్రంలో విజయం సాధించిన పార్టీయే దేశవ్యాప్తంగా 77 శాతం రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఫలితంగా ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. 
4. లోక్‌సభ ఎన్నికల్లో కార్పొరేట్‌ ఫండింగ్‌ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెల్సిందే. సాక్షి ప్రత్యేకం. అందువల్ల రాష్ట్ర ఎన్నికలపై కూడా కార్పొరేట్‌ ఫండింగ్‌ ప్రభావం ఉంటుంది. ఇది కూడా జాతీయ పార్టీలకే ప్రయోజనకరం. 
5. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌కు అధిక సిబ్బంది అవసరం. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు లేదా రసీదులిచ్చే ఓటింగ్‌ యంత్రాలు భారీ సంఖ్యలో కావాలి. వాటి కొనుగోలుకే దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నది ఎన్నికల కమిషన్‌ అంచనా. 

Advertisement

తప్పక చదవండి

Advertisement