ఎమ్మెల్యేల రాజీనామా వెనుక సిద్ధరామయ్య | Siddaramaiah Hand in Resignation of Karnataka MLAs | Sakshi
Sakshi News home page

రెబెల్స్‌ రిలాక్స్‌ సంకీర్ణం అదుర్స్‌

Jul 8 2019 8:57 AM | Updated on Jul 8 2019 8:57 AM

Siddaramaiah Hand in Resignation of Karnataka MLAs - Sakshi

సిద్ధరామయ్య

ఒకవైపు 10 మందికిపైగా సంకీర్ణ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు ఇచ్చేసి ముంబయిలోని రిసార్టులో సేదదీరుతుండగా ఉద్యాననగరిలో సంకీర్ణ ప్రభుత్వం ప్రకంపనలకు గురవుతోంది. గత వారంరోజుల్లో 12 మంది శాసనసభ్యులు రాజీనామాలు ప్రకటించడం తెలిసిందే. దీంతో కుమారస్వామి సర్కారు తీవ్ర ప్రమాదంలో పడింది. ఇందుకు ఆపరేషన్‌ కమల ఒక కారణమైతే, సిద్ధరామయ్య కూడా మరో కారణమని సంకీర్ణంలో అనుమానాలు కమ్ముకున్నాయి.  

సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ ఎమ్మెల్యేల రాజీనామా వెనుక సీఎల్పీ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య పాత్ర ఉందని సొంతపార్టీలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వంపై ఆరంభం నుంచి తిరుగుబాటు చేస్తున్న వారిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, అందులో కూడా  సిద్ధరామయ్య వర్గంగా గుర్తింపు పొందిన వారే ఎక్కువమంది ఉండడం విశేషం. 12 మంది శాసనసభ్యులూ సిద్ధరామయ్య సూచన మేరకే రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. బెంగళూరుకు చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వీరిలో ఉండగా, వారిలో చాలామంది సిద్ధరామయ్యకు సీఎం పీఠం అప్పగిస్తే తాము రాజీనామా ఉపసంహరణకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరిలో తాను ఓడిపోవడానికి జేడీఎస్‌ కారణమని సిద్ధు ఆది నుంచి గుర్రుగా ఉన్నారు. దానికి తోడు జేడీఎస్‌ అధినేత దేవెగౌడ కుటుంబంతో ఆయనకు శతృత్వం ఉండడం,  సంకీర్ణ ప్రభుత్వంనడపడంలో విభేదాల వల్ల సిద్ధరామయ్య ఈ సర్కారు పతనానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. 

సిద్ధు, వేణుగోపాల్‌ చర్చలు  
సిద్ధరామయ్య నివాసంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ అధ్యక్షతన ఆదివారం భేటీ నిర్వహించారు. సిద్ధరామయ్య సీఎం, జేడీఎస్‌ నేత రేవణ్ణ డిప్యూటీ సీఎం అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి, రాజరాజేశ్వరినగర ఎమ్మెల్యే మునిరత్న ఇందులో పాల్గొన్నారు. రెబెల్స్‌ తరఫున వారు మాట్లాడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జయనగర ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి, చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్, ఖానాపుర ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్‌ కూడా సిద్ధరామయ్యతో చర్చించారు. ఆదివారం విధానసౌధలో నిర్వహించాల్సిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని ఎమ్మెల్యేల గైర్హాజరు భయంతో వాయిదా వేశారు. మరోవైపు ముంబయి తరలిన ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ వారెవ్వరూ పట్టించుకున్నట్లు లేదు.  

సీఎం, డిప్యూటీ సీఎంపై సిద్ధు అసహనం
‘ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడాలని సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ చెప్పారు. అయితే ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఫోన్‌లు స్విచాఫ్‌ వస్తున్నాయి. అయినా ఇది సీఎం, డిప్యూటీ సీఎం చేయాల్సిన పని. నేనేం చేయలేను. పరిస్థితి నా చేయి దాటిపోయింది. ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేశారని కేసీ వేణుగోపాల్‌ ప్రశ్నించారు. వారికి న్యాయం చేయకుంటే ఏం చేస్తారని సమాధానం ఇచ్చాను. కేబినెట్‌ విస్తరణతో పూర్తిగా అలకబూనారు. నేను చెప్పిన వారికి కేబినెట్‌ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత దిగజారేది కాదు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement