ఆ సన్నాసులు పోతే నష్టమేం లేదు: రేవంత్‌ రెడ్డి | Sakshi
Sakshi News home page

ఆ సన్నాసులు పోతే నష్టమేం లేదు: రేవంత్‌ రెడ్డి

Published Mon, Oct 1 2018 11:10 AM

Revanth Reddy Slams On KCR Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్‌ చెప్పారని.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు గాని, కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలొచ్చాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇంట్లో ఇద్దరు ముసలోళ్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పింఛన్‌ ఇస్తే.. కేసీఆర్‌ ఒక్కరికే ఇచ్చి ముసలోళ్లకు కయ్యం బెట్టిండని, అదే కేసీఆర్‌ ఇంట్ల ఐదుగురికి కలిపి నెలకు రూ. 30 లక్షల జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు. ఆదివారం కామా రెడ్డి జిల్లాలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు.  బస్వాపూర్, భిక్కనూరు, కామారెడ్డి పట్టణం లోని నిజాంసాగర్‌ చౌరస్తాలలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి దళితుల భూములు, మిషన్‌ కాకతీయ కమీషన్‌లు, ప్రాజెక్ట్‌ పనుల్లో, పైప్‌లైన్‌ కంపనీల్లో కమీషన్‌లు సరిపోతలేవన్నా రు. బాన్సువాడలో పోచారం కుమారులు ఇసుక కంకర పేరుతో దోచుకుంటున్నారని విమర్శించా రు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకుంటే, గంప గోవర్ధన్‌ నియోజకవర్గాన్ని దోచుకున్నాడన్నారు. అడవి పందుల వలే ప్రజల సొమ్మును దోచు కున్న వీరిని ఓటు అనే కరెంట్‌ షాకుతో మట్టు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఇటీవల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు కొందరికి టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు సన్నాసులుపోతే కాంగ్రెస్‌కు నష్టం ఏమీ లేదన్నారు.

ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు.. 
డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్‌ బెడ్‌రూంలు ఇస్తా, దళితులకు మూడెరకాల భూమిస్తా, గిరిజనులకు, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్‌లు ఇస్తా, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి ఇస్తా అని ఎన్నోన్నో హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కేసీఆర్‌.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు కొరివి ద య్యాలుగా కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురు తయారయ్యారన్నారు. బోధన్‌ నిజాంషుగర్స్‌ తలుపులు తెరుచుకోక పోవడం కేసీఆర్‌ పుణ్యమే అన్నారు.  వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడాలన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ బానిస సుమన్‌ అని, కాంగ్రెస్‌ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని, కార్యకర్తలే అతనికి బుద్ధి చెబుతారన్నారు.

షబ్బీర్‌ అలీ గెలిస్తే.. 
షబ్బీర్‌ అలీని గెలిపిస్తే వచ్చే సర్కారులో ఒకటి రెండు స్థానాల్లో ఉంటారన్నారు. గతంలో కిరాయి ఇంట్లో ఉంటున్న అని గంప గోవర్ధన్‌ చెప్పాడని, ఇప్పుడు కామారెడ్డిలో రూ.3 కోట్లతో ఇల్లు ఎలా కట్టాడో ప్రజలు ఆలోచించాలన్నారు.  కేసీఆర్‌ అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని ఐటీ దాడులు చేయిస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నా ఇంటి నుంచి ఐటీ అధికారులు తీసుకెళ్లిన సూటుకేసుల్లో కేసీఆర్‌ అక్రమాలు, అవినీతి గురించి సమాచార హక్కు చట్టం ద్వారా తాను సేకరించిన కాగితాలే ఉన్నాయన్నారు. తన జుట్టును కూడా సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌లు పీకలేరన్నారు. పీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌రావు, పీసీసీ కార్యదర్శి ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌ బిన్‌ హుందాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement