మధ్యయుగపు చక్రవర్తిలా కేసీఆర్‌ యవ్వారం

Revanth Reddy Fires On CM KCR In Gandhi Bhavan - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్‌, మధ్యయుగపు చక్రవర్తిలాగా యవ్వారం చేస్తున్నాడని కొడంగల్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో రేవంత్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కేరళ వరదల హడావిడి కన్నా ఏదో ఉపద్రవం వచ్చినట్లు కొంగరకలాన్‌ సభ ఉందని మండిపడ్డారు. సభకు వచ్చే 25 లక్షల మందిని తమ సైన్యం లాగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని ఆరోపించారు. ఊరికో ట్రాక్టర్‌ రావాలని కేసీఆర్‌ చెప్పడం చట్టాన్ని ఉల్లంఘించడం కాదా..ట్రాక్టర్లలో ప్రజా రవాణా నిషిద్ధమని తెలియదా అని ప్రశ్నించారు. ట్రాక్టర్లలో ప్రజలను తరలించాలన్న కేసీఆర్‌ మీద కేసు పెట్టాలా లేదా అని సూటిగా అడిగారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ మీద క్రిమినల్‌ కేసు పెట్టి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఔటర్‌ రింగు రోడ్డు మీద గంపగుత్తగా టోల్‌ ఎత్తి వేసే అధికారం మీకెక్కడిదని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్‌ పెట్టుకునే దిక్కుమాలిన సభకు నిబంధనలు ఉల్లంఘిస్తారా అని ప్రభుత్వ అధికారులను సూటిగా ప్రశ్నించారు. న్యాయస్థానం ఎందుకు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. హరిత హారం అని నాటకాలు ఆడిన కేసీఆర్‌, సభ కోసం వేల చెట్లను నరికి వేయించి కుప్పలాగా వేశారని  విమర్శించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వారు కూడా కేసీఆర్‌ మీద క్రిమినల్‌ కేసులు పెట్టి బొక్కలో పెట్టాలని సూచించారు. ప్రభుత్వ జీతభత్యాలతో పథకాల ప్రచారం కోసం నియమించుకున్న కళాకారులను పార్టీ సభలో పాడాలని ఆదేశించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఉల్లంఘనలన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top