సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?

Revanth Reddy challenges Harish Rao For An Open Debate - Sakshi

ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి హరీశ్‌రావుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. అది గన్‌పార్కు అయినా, ప్రెస్‌క్లబ్‌ అయినా తాను రెడీ అని, తమ వాదన తప్పని హరీశ్‌ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన ప్రకటించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హరీశ్‌కు నిజాయితీ ఉంటే నీళ్లు–నిజాలపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. నీళ్లను అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుంటోందని వ్యాఖ్యానించారు.

నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల అంచనాతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించి రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పేరు, డిజైన్‌ మార్చి కాళేశ్వరం పేరుతో వేల కోట్లకు అంచనాలను పెంచింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అల్లుడు ఆణిముత్యంలా మామ స్వాతిముత్యంలా కేసీఆర్, హరీశ్‌లు నిత్యం పొగుడుకుంటున్నారని, కేసీఆర్‌ ప్రారంభించిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు పేరేంటో హరీశ్‌ చెప్పగలరా అని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వనందుకు ఎస్సెల్బీసీ టన్నెల్‌ తవ్వకం పనులు నిలిపివేశారని ఆరోపించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top