రేణుక ఆత్మీయ ‘అసమ్మతి’

renuka chowdary fires on tpcc chief bhatti vikramarka - Sakshi

ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలతో భేటీ

టీపీసీసీ నాయకత్వంపై విరుచుకుపడిన కేంద్ర మాజీమంత్రి

రాహుల్‌ చెప్పిందొకటి..జరుగుతుందొకటని ఆగ్రహం

సీఎల్పీ నేత భట్టిపై పరోక్ష విమర్శలు...

ఏఐసీసీ నేత కొప్పుల రాజు వ్యవహారశైలిపైనా అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేణుకాచౌదరి అనూహ్యంగా అసమ్మతిగళంతో తెరపైకి వచ్చారు. టీపీసీసీ నాయకత్వం తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ చెప్పింది ఒకటయితే, రాష్ట్రంలో జరుగుతోంది మరొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకే చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై పరోక్ష విమర్శలు చేశారు.

పదవులు... కిరీటాలు కావు...
కార్యకర్తలనుద్దేశించి రేణుక మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తు ఆందోళనగా ఉందని, పదవులు కొత్తగా వచ్చినవాళ్లు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో తామే గెలిపించామని కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ గెలిచింది మాత్రం కార్యకర్తల పట్టుదల వల్లేనని అన్నారు. తాను సహకరించలేదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని, తాను తలచుకుంటే ఆ ముగ్గురు గెలిచేవారా అని రేణుక ప్రశ్నించారు.

కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుంటేనే పార్టీ బాగుపడుతుందని, పదవులు వచ్చినంత మాత్రాన కిరీటాలు రావనే విషయాన్ని గుర్తెరగాలని ఆమె భట్టిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తమ బినామీలను కాపాడుకుంటూ వారికి మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నారని, చదువురాని వాళ్లకు బాధ్యతలు ఇస్తే పార్టీ నాశనం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎస్సీ, ఎస్టీ నేతకు కూడా అవకాశం ఇవ్వకుండా తన వాళ్లకే పదవులు ఇప్పించుకున్నారని విమర్శించారు.

ఖమ్మం నుంచి పోటీ చేస్తా...
రానున్న ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు రేణుక వెల్లడించారు. అయితే, పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, ఎవరికి దరఖాస్తు చేసుకుంటే టికెట్‌ ఇప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎవరు తీసుకున్నారని ఆమె నిలదీశారు. అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా తాను సహకరిస్తానని, అయితే ఖమ్మం జిల్లానేతలు కాకుండా ఇతరులకు అవకాశం ఇస్తే కార్యకర్తలు మాత్రం ఊరుకునే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ కోసం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతానని, అయితే ఎన్నాళ్లయినా పార్టీలో ఉండే పోరాటం చేస్తాను తప్ప కాంగ్రెస్‌ పార్టీని వీడేదిలేదని రేణుక స్పష్టం చేశారు.

ఏంటీ ‘రాజ’రికం?
ముఖ్యంగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు సహకారంతోనే ఆయన ముందుకెళుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే కొప్పుల రాజు వ్యవహారశైలిపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తానని మాజీమంత్రి దామోదర్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను రేణుకాచౌదరికి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి మానవతారాయ్, ఖమ్మం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్, ఖమ్మం నగర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగెండ్ల దీపక్‌ చౌదరి, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు వి.వి.అప్పారావు, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ బుక్కా కృష్ణవేణి, మాజీ జడ్పీటీసీ పగడాల మంజుల, ఐఎన్‌టీయూసీ నేత జలీల్‌ఖాన్, మైనార్టీ నాయకుడు చోటేబాబా తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top