breaking news
khammam parliamentary constituency
-
రేణుక ఆత్మీయ ‘అసమ్మతి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరి అనూహ్యంగా అసమ్మతిగళంతో తెరపైకి వచ్చారు. టీపీసీసీ నాయకత్వం తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ చెప్పింది ఒకటయితే, రాష్ట్రంలో జరుగుతోంది మరొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకే చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై పరోక్ష విమర్శలు చేశారు. పదవులు... కిరీటాలు కావు... కార్యకర్తలనుద్దేశించి రేణుక మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తు ఆందోళనగా ఉందని, పదవులు కొత్తగా వచ్చినవాళ్లు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో తామే గెలిపించామని కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ గెలిచింది మాత్రం కార్యకర్తల పట్టుదల వల్లేనని అన్నారు. తాను సహకరించలేదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని, తాను తలచుకుంటే ఆ ముగ్గురు గెలిచేవారా అని రేణుక ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుంటేనే పార్టీ బాగుపడుతుందని, పదవులు వచ్చినంత మాత్రాన కిరీటాలు రావనే విషయాన్ని గుర్తెరగాలని ఆమె భట్టిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తమ బినామీలను కాపాడుకుంటూ వారికి మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నారని, చదువురాని వాళ్లకు బాధ్యతలు ఇస్తే పార్టీ నాశనం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎస్సీ, ఎస్టీ నేతకు కూడా అవకాశం ఇవ్వకుండా తన వాళ్లకే పదవులు ఇప్పించుకున్నారని విమర్శించారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తా... రానున్న ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు రేణుక వెల్లడించారు. అయితే, పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, ఎవరికి దరఖాస్తు చేసుకుంటే టికెట్ ఇప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎవరు తీసుకున్నారని ఆమె నిలదీశారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తాను సహకరిస్తానని, అయితే ఖమ్మం జిల్లానేతలు కాకుండా ఇతరులకు అవకాశం ఇస్తే కార్యకర్తలు మాత్రం ఊరుకునే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ కోసం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతానని, అయితే ఎన్నాళ్లయినా పార్టీలో ఉండే పోరాటం చేస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని రేణుక స్పష్టం చేశారు. ఏంటీ ‘రాజ’రికం? ముఖ్యంగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు సహకారంతోనే ఆయన ముందుకెళుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే కొప్పుల రాజు వ్యవహారశైలిపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తానని మాజీమంత్రి దామోదర్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను రేణుకాచౌదరికి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి మానవతారాయ్, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ఖమ్మం నగర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగెండ్ల దీపక్ చౌదరి, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు వి.వి.అప్పారావు, ఓబీసీ సెల్ చైర్మన్ బుక్కా కృష్ణవేణి, మాజీ జడ్పీటీసీ పగడాల మంజుల, ఐఎన్టీయూసీ నేత జలీల్‌ఖాన్, మైనార్టీ నాయకుడు చోటేబాబా తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు రేణుకా చౌదరి ఝలక్!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆమె ప్రకటన చేశారు. గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ప్రకటన చేశారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇతరులకు ఇస్తారంటూ లీకులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఈసారి టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగనే అభిప్రాయంలో ఉన్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని కార్యకర్తలు కూడా రేణుకా చౌదరిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి ఇటీవలి డీసీసీ అధ్యక్షులు నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని రేణుకాచౌదరి నివాసంలో జరిగిన సమావేశానికి ఖమ్మం కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో సానుకూల ఫలితాలు లభించడంతో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దాంతో ఖమ్మం పార్లమెంట్ సీటుపై పార్టీ అధిష్టానం ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని అనేక మంది ముఖ్య నేతలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రేణుకా చౌదరి తాజా ప్రకటన...కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసినట్లు అయింది.