జైలుకెళ్లడానికి సిద్ధంగా: శరద్‌ పవార్‌

Ready To Go To Jail Says Sharad Pawar In Corruption Case - Sakshi

సాక్షి, ముంబై: తనను జైలుకు పంపేందుకు కొంత మంది కుట్రపూరితంగా ప్రణాళికలు రచిస్తున్నారని ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్ ఆరోపించారు. తనపై కేసులు రుజువైతే జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. శరద్‌ పవార్‌, ఆయన అన్నకొడుకు అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై బుధవారం ఉదయం పవార్‌ తీవ్రంగా స్పందించారు. తాను ఏ క్షణమైనా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్టోబర్‌ 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఇలాంటి అక్రమ కేసులు తాను ముందే ఊహించానని అన్నారు. తనకు సంబంధం లేని కుంభకోణంలో తన పేరును చేర్చినందుకు ఈడీకి ధన్యవాదాలంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ఎన్‌సీపీ– కాంగ్రెస్‌ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఈ పరిణామం సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నేతలు బీజేపీపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలను నేరుగా ఎదుర్కొలేక ఇలా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

కాగా రైతులకు రుణాల మంజూరులోఎంఎస్‌సీబీలో ఆడిట్‌ చేపట్టిన నాబార్డు రైతులకు రుణాల మంజూరులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేల్చింది. ఈవోడబ్ల్యూ ఈ మేరకు ముంబై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కుంభకోణంలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటి ఆధారంగా మంగళవారం ఈడీ అప్పటి సీఎం శరద్‌పవార్‌ సహా 2007–17 సంవత్సరాల మధ్య పనిచేసిన ఎంఎస్‌సీబీ డైరెక్టర్లు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తో పాటు 70 మంది మాజీ అధికారులపై కేసులు పెట్టింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top