ఎన్డీయేలో చేరండి: శరద్‌ పవార్‌కు విజ్ఞప్తి

Ramdas Athawale Urges NCP Chief Sharad Pawar To Join NDA - Sakshi

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు కేంద్ర మంత్రి విజ్ఞప్తి

ముంబై: భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే(నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌) కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ(నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ) అధినేత శరద్‌ పవార్‌కు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే విజ్ఞప్తి చేశారు. ఈ కలయిక మహారాష్ట్ర అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. శివసేనతో జట్టు కట్టినందు వల్ల ఎన్సీపీకి ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. శరద్‌ పవార్‌ గనుక ఎన్డీయేలో భాగస్వామ్యమయ్యేందుకు సిద్ధంగా ఉంటే బీజేపీ, ఎన్సీపీ, ఆర్పీఐ(అథవాలే పార్టీ)లు మహారాష్ట్రలో ‘మహాయుతి’ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి మహారాష్ట్రకు అధిక నిధులు రావాలంటే ఈ విషయం గురించి పవార్ తీవ్రంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా అథవాలే తన అభిప్రాయాలను వెల్లడించారు. (నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శ‌ర‌ద్ ప‌వార్)

‘‘శరద్‌ పవార్‌ మహారాష్ట్రలో సీనియర్‌ నాయకుడు. రైతులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల సమస్యల గురించి ఆయనకు బాగా తెలుసు. నరేంద్ర మోదీతో చేతులు కలపాలని  నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశాభివృద్ధికి ఇది ఎంతో కీలకం. అయితే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నా ఆకాంక్ష’’అని అథవాలే వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా అనేక దోబూచులాటలు, పరిణామాల మధ్య శివసేన, కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 105 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. 56 సీట్లలో విజయం సాధించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుంది. (ప్రియాంక రాయబారం : మెత్తబడిన పైలట్‌ )

ఇక కొన్ని రోజులుగా సంకీర్ణ సర్కారులో విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో అథవాలే ఈ మేరకు బహిరంగంగా శరద్‌ పవార్‌కు ఎన్డీయేలో చేరాలంటూ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మరోవైపు.. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తరుణంలో అథవాలే వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని సర్కారును కూలదోసి.. జ్యోతిరాదిత్య సింధియా ప్రోద్బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top