‘ఆ విషయంలో మోదీకి బేషరతుగా మద్దతు’

Rahul Gandhi Support To Narendra Modi In Women Reservation Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహిళ రిజర్వేషన్‌ బిల్లు అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో మహిళ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌లో స్పందించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రధానికి రాసిన లేఖను పోస్ట్‌ చేశారు. ‘మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుంది. 2010 మార్చి 9వ తేదీన మహిళ రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయిందనే విషయం మీకు తెలిసిందే. కానీ ఎనిమిదేళ్లయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ దీనిని చరిత్రాత్మక బిల్లుగా పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్‌ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. బీజేపీ కూడా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళ రిజర్వేషన్‌ బిల్లు గురించి పేర్కొంది.

మోదీ తన ప్రసంగాల్లో మహిళ సాధికారత గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. మీ ఆశయాన్ని నేరవేర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. బిల్లు ప్రవేశపెట్టడానికి వచ్చే పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల కన్నా మంచి సమయం ఉండదు. దీనిలో జాప్యం జరిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బిల్లు ఆమోదం పొందడం అసాధ్యమవుతోంది. లోక్‌సభలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలుపుతోంది. ఈ చరిత్రాత్మక బిల్లును సాకారం చేయాల్సిన అవసరం ఉంది. 

దీనిపై  ప్రజల్లో అవగాహన కల్గించేలా కాంగ్రెస్‌ పార్టీ  32 లక్షల మందితో ఈ బిల్లుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది. మేము వీటిని మీకు అందజేస్తాం. ఈ బిల్లు చట్టంగా మారితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు పోటీ చేయడానికి అవకాశం దక్కుతోంది. మహిళ సాధికారత విషయంలో అందరం కలసి భారత ప్రజలకు గొప్ప సందేశాన్ని ఇద్దాం. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిద్దాం’ అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. 

శనివారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ కేవలం ముస్లింల పక్షానే నిలుస్తుందని, ట్రిపుల్‌ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రధాని విమర్శలు, మరోవైపు  జూలై 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు తెలుపుతూ రాహుల్‌ గాంధీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top