కాపలాదారు కాదు.. భాగస్వామి

Rahul Gandhi Speech on No Confidence Motion in Lok sabha - Sakshi

అవినీతిపరులతో మోదీ చేతులు కలిపారు

బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు ద్వేషానికి ఏజెంట్లు

లోక్‌సభలో కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్‌ గాంధీ

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ప్రజలకు కాపలాదారుగా ఉంటానంటూ నాడు అధికారంలోకి వచ్చిన మోదీ నేడు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు సహా అనేక అంశాల్లో అవినీతిపరులతో చేతులు కలిపి భాగస్వామిగా మారారని రాహుల్‌ ఆరోపించారు. మోదీ గిమ్మిక్కులకు, అబద్ధాలకు ప్రజలు బలవుతున్నారన్న రాహుల్‌.. పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను బీజేపీ అవమానించినా, ‘పప్పు’ అని సంబోధించినా ఆ పార్టీపై, నాయకులపై తనకు ద్వేష భావం లేదనీ, ప్రేమను పంచడమే తన, కాంగ్రెస్‌ సిద్ధాంతం అని రాహుల్‌ చెప్పారు. ‘ఆరెస్సెస్, బీజేపీల అగ్రనేతలు కోపం, ద్వేషాలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్‌ నేత, భారతీయుడు, శివుడు, హిందువు’ అనే పదాలకు అర్థాన్ని తెలిపినందుకు వారికి ధన్యవాదాలు’ అని అన్నారు. గంటకు పైగానే ప్రసంగించిన రాహుల్‌.. అనంతరం మోదీ వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు.

మోదీ ఒత్తిడి వల్లే ఆమె మాట తప్పారు
ఫ్రాన్స్‌తో భారత్‌ చేసుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్‌ మాట్లాడుతూ.. ‘మోదీ ఒత్తిడి తెస్తుండటం వల్లే నిర్మలా సీతారామన్‌ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ ఒప్పందంతో ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తోంది? మోదీ, నిర్మల.. దయచేసి దేశానికి చెప్పండి’ అని రాహుల్‌ కోరారు. దీంతో సభను రాహుల్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మల పేర్కొనడంతో కొద్దిసేపు బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య రహస్య ఒప్పందం కారణంగా రాఫెల్‌ యుద్ధ విమానాల ధరలను బయటపెట్టలేమని ఇక్కడ ప్రభుత్వం అంటోందనీ, ఇదే విషయమై ఫ్రాన్స్‌ అధ్యక్షుడితో తాను మాట్లాడితే అలాంటి రహస్య ఒప్పందాలేవీ లేవని ఆయన తనకు చెప్పినట్లు రాహుల్‌ తెలిపారు. ‘కొంత మందితో మోదీకి ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ప్రధాని తన ‘మార్కెటింగ్‌’ కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా ఎవరెవరు ఇస్తున్నారో కూడా అందరికీ తెలుసు. అలా ఇస్తున్న వారిలో ఓ వ్యక్తి చేతికే రాఫెల్‌ ఒప్పందం వెళ్లింది. వారికి ప్రస్తుతం రూ.35 వేల కోట్ల అప్పు ఉండగా ఈ ఒప్పందం వల్ల రూ. 45 వేల కోట్ల లాభం వస్తోంది’ అని రాహుల్‌ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్‌ నుంచి తప్పించి ఈ ప్రాజెక్టును ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.   

మీ వాళ్లే ఓడిస్తారు..
ప్రతిపక్షాలవే కాకుండా బీజేపీలోని ఓ వర్గం నేతల ఆవేదనను కూడా తన ప్రసంగం ద్వారా తాను బయటకు తెస్తున్నాననీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ లోని వారు కూడా ప్రయత్నిస్తారని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఉన్నా లేకున్నా ఒకటేననీ, కానీ మోదీ, అమిత్‌ షా మాత్రం బీజే పీ అధికారంలో లేకపోతే జీర్ణిం చుకోలేరన్నారు. ‘మోదీ నవ్వుతుండటం నేను చూస్తున్నా. అయినా లోలోపల ఆయన గాభరా పడుతున్నారు. ఆయన నా కళ్లలోకి కాకుండా ఎక్కడెక్కడో చూస్తున్నారు’ అని అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తమ నిరసనను మరింత పెంచారు.

సూటు వేసుకుంటేనే రుణమాఫీనా?
15–20 మంది బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రూ. 2.5 లక్షల కోట్ల అప్పులను గత నాలుగేళ్లలో మాఫీ చేసిన ప్రభుత్వం, రైతుల రుణాలను మాత్రం రద్దు చేయడం లేదని రాహుల్‌ విమర్శించారు. రైతులు సూటుబూటు వేసుకోకపోవడమే అందుకు కారణమా అని ప్రశ్నించారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల నగదును జమ చేస్తానని మోదీ ఇచ్చిన హామీ లాగానే తాజాగా పంటలకు మద్దతు ధర కూడా అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. చరిత్రలో తొలిసారిగా, భారత్‌లో మహిళలకు రక్షణ లేదనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు.

అవాక్కైన మోదీ
రాహుల్‌ తన ప్రసంగం అనంతరం మోదీ సీటు వద్దకు వెళ్లడంతో ఆయన కాస్త అయోమయానికి గురయ్యారు. లేచి నిలబడాల్సిందిగా రాహుల్‌ మోదీని కోరినా ఆయన అయోమయంలో ఉండటంతో స్పందించ లేదు. దీంతో మోదీ కూర్చొని ఉండగానే రాహుల్‌ ఆయనను కౌగిలించుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి మోదీ సహా సభలోని సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అనంతరం తేరుకున్న మోదీ.. అప్పటికే రాహుల్‌ వెళ్లిపోతుండటంతో ఆయ నను వెనక్కు పిలిచి కరచాలనం చేసి భుజంపై తట్టి కొన్ని మాటలు చెప్పారు. తర్వాత తన సీటు వద్దకు వచ్చిన రాహుల్‌ ‘ఇదీ హిందుత్వం అంటే’ అని అన్నారు. కూర్చున్నాక పక్కన ఉన్న సహచరుడి వంక చూసి నవ్వుతూ కన్ను కూడా కొట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top