మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు

Rahul Gandhi blames party trio of placing sons before party - Sakshi

మోదీపై ఆయనది ఒంటరి పోరాటం

సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు

ముగ్గురికి పార్టీ కన్నా కుమారులే ఎక్కువయ్యారు: రాహుల్‌

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీలోని అగ్రనాయకులందరూ తమ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఒంటరివాడిని చేశారనీ, ఎవ్వరూ ఆయనకు తోడుగా నిలవలేదని రాహుల్‌ చెల్లెలు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించినట్లు సమాచారం. అలాగే రాహుల్‌ కూడా ముగ్గురు సీనియర్‌ నేతలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాను వద్దని చెబుతున్న తమ కొడుకులను పోటీలోకి దింపారని ఆరోపించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తన కొడుక్కి టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి.చిదంబరం బెదిరించారనీ, ముఖ్యమంత్రి కొడుక్కే టికెట్‌ ఇవ్వకపోతే ఎలా అని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ మాట్లాడారనీ, ఇక రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కూడా తన కొడుక్కి టికెట్‌ తెప్పించుకుని, ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసి మిగతా ప్రాంతాలను ఆయన విస్మరించా రని రాహుల్‌ ఆరోపించినట్లు సమాచారం.

చిదంబరం, కమల్‌నాథ్‌ కుమారులు ఎన్నికల్లో గెలవగా, గెహ్లాట్‌ కొడుకు  ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో  భారీ అపజయాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం జరిగింది. ఎన్నికల్లో తీవ్ర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తాననీ, తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు ఈ పదవి ఇవ్వాలని రాహుల్‌ ప్రతిపాదించగా, పలువురు నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ప్రియాంకలు నిర్మొహమాటంగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓటమికి కారకులంతా ఇక్కడే ఉన్నారు..
సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అగ్రనేతలెవరూ తన అన్నకి మద్దతుగా నిలవలేదనీ, మోదీపై ఆయన ఒంటరిగా పోరాడారని అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె మాట్లాడుతూ ‘పార్టీ ఓటమికి కారణమైన వాళ్లంతా ఈ గదిలో కూర్చున్నారు’ అని అన్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా రాహుల్‌ను కొందరు నేతలు ఒప్పిస్తుండగా ప్రియాంక కలగజేసుకుని, ‘మా అన్న ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. రఫేల్‌ కుంభకోణం, కాపలాదారుడే దొంగ అన్న నినాదాన్ని రాహుల్‌ మినహా కాంగ్రెస్‌ నేతలెవరూ ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడికి మీరెవరూ మద్దతు తెలుపలేదు’ అని ప్రియాంక అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top