మోదీపై రాహుల్‌ విసుర్లు

Rahul Dig Modi at PhD Chamber of Commerce Session - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విశాలమైన ఛాతీ ఉందనే ప్రధాని నరేంద్ర మోదీకి చాలా చిన్న హృదయం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘భారతీయ దార్శనికతను అర్థం చేసుకుని, అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నాయని ఆశించారని ప్రజలు ఆయన(మోదీ)కు పట్టం కట్టారు. నేడు అదంతా తలక్రిందులయ్యింది. ప్రతి వ్యక్తీ దొంగేనని ఆయన, ఆయన ప్రభుత్వం అనుకుంటున్నాయి’’ అని రాహుల్‌ ఆరోపించారు. గురువారం పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గురువారం నిర్వహించిన 112వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

డబ్బంతా నల్లధనం కాదని, అలాగని నల్లధనమంతా నగదు కాబోదని అని  మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఛలోక్తులు విసిరాడు. పాత‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వ‌ల్ల  దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంతా సవ్యంగా ఉందన్న ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నాడు. ప్రధాని మోదీ ప్రజలపై ఒకదాని వెంట మరోక(నోట్ల రద్దు, జీఎస్టీ) దెబ్బలు వేశారు. అవి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి అని రాహుల్ చెప్పారు. స్టార్టప్‌ ఇండియాకు తాను మద్ధతు తెలుపుతానని. కానీ, అది షట్‌ అప్‌ ఇండియా(మూసివేత)కు దారి తీసేలా ఉండకూడదని అన్నారు. నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్ల వర్థంతి దినం పాటిస్తామన్నారు.

తాజ్‌ మహల్‌ వివాదంపై స్పందిస్తూ... ప్రజలంతా ఒకప్పుడు నేతల నుంచి నైతిక విలువలు కోరుకునేవారు. కానీ, ఇప్పుడు చారిత్రక కట్టడాలను భారతీయులు కట్టారా? వేరే వాళ్లు కట్టారా? అంటూ నేతలు చేస్తున్న వాదనలు చూసి ప్రపంచం మొత్తం నవ్వుకుంటుందని చెప్పారు. ఈ మూడేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘటనను ఎంఎండీ( మోదీ మేడ్‌ డిజాస్టర్‌- మోదీ చేసిన విధ్వంసం)గా రాహుల్‌ అభివర్ణించారు. నిరుద్యోగం పెరిగిపోయిందని.. చైనాలో రోజుకి 50,000 ఉద్యోగాల కల్పన అందిస్తుంటే.. ఇండియాలో కేవలం 458 మాత్రమే ఉందన్నారు. ఉద్యోగాల రూపకల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ఆక్షేపించారు.

అంతకు ముందు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌ ట్విట్టర్ లో కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. పాత‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వ‌ల్ల భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంద‌ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జైట్లీ మెడిసిన్లకు (ఆలోచ‌నా శ‌క్తికి) ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌ట్టిన జ‌బ్బును న‌యం చేసే శ‌క్తి లేద‌ని చుర‌క‌లంటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top