రాజకీయ వ్యభిచారి చంద్రబాబు

Posani krishna murali commented over chandrababu naidu - Sakshi

సినీ నటుడు పోసాని కృష్ణమురళి

సాక్షి, హైదరాబాద్‌: స్వార్థమే పరమావధిగా పూటకో మాట మారుస్తున్న సీఎం చంద్రబాబు  రాజకీయ వ్యభిచారి అని, ఇలాంటి వ్యక్తిని సినీ పరిశ్రమ ఎందుకు అనుసరించాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు స్వార్థం కోసం రోజుకో మాట మార్చడం, రాజకీయ బ్రోకరిజం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తికి చెందిన పార్టీ నేతలు తెలుగు సినీ పరిశ్రమలోని వారిని తప్పుపట్టడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పోసాని తాజాగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం  తీరును ఎండగట్టారు. పోసాని ఇంకా ఏం చెప్పారంటే...

బాబు వెనుక ఎందుకు నడవాలి?
‘‘ప్రత్యేక హోదా మాటెత్తితే జైళ్లలో పెట్టాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. హోదా కోసం ఉద్యమించిన వారిని లాఠీలతో కొట్టించారు. అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. ఇలా చేసిన బాబే ఇప్పుడు మళ్లీ  హోదా కోసం ఉద్యమం చేయాలనడాన్ని ఏమనాలి? రాజకీయ బ్రోకరిజం అనాలా? వెధవాతి వెధవలు అనాలా? ఉద్యమంలోకి రాని మమ్మల్ని (సినీ పరిశ్రమ) తిడతారే మిటి? ఈ విషయంలో చంద్రబాబు వ్యూహంఏమిటి? చంద్రబాబు, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ లాంటి రాజకీయ బ్రోకర్లను నమ్మి సినీ పరిశ్రమ వాళ్లు వెర్రివాళ్లలాగా ప్రత్యేక హోదా ఉద్యమంలోకి దూకాలా? ఏ విషయంలో మాటమీద నిలబడ్డారని చంద్రబాబు వెనుక నడవాలి?

సుజనా చౌదరి సంగతేంటి?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పెట్టుకుని రాష్ట్రమంతా తిరిగి కష్టపడి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే, వారిలో 23 మందిని డబ్బులిచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారు. వారిని ఇంటికి తీసుకెళ్లి కండువాలు మార్చారు. 

వేరే పార్టీ టిక్కెట్‌పై గెలిచిన వారిని పదవులకు రాజీనామా చేయించకుండా తన పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు రాజకీయ బ్రోకర్‌ కాక మరేమవుతారు? సినిమా వాళ్లు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి బ్రోకరిజం చేయాలా? జగన్‌ అవినీతిపరుడు అని విమర్శిస్తున్న చంద్రబాబుకు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కనిపించలేదా? ఇలాంటి వ్యక్తిని ఎందుకు చంకలో పెట్టుకుని రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు? బాబు నీతిమంతుడైతే కేంద్రంతో మాట్లాడి సుజనా చౌదరికి ఎందుకు మంత్రి పదవి ఇప్పించారు? సుజనా చౌదరికో నీతి? జగన్‌కో నీతా? బస్సుల్లో పడుకున్నానని చెప్పుకునే చంద్రబాబుకు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక విమానాలు ఎందుకు?

బెంజి సర్కిల్‌ దాకా చాలు
 హోదా కోసం ఎందాకైనా పోరాడుతామని బాబు అంటున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎందాకో అక్కర్లేదు, విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోమనండి. ముస్లింలు రంజాన్‌ మాసంలో ఉపవాసం పాటించినట్లు 30 రోజులు ఆమరణ దీక్ష చేసేందుకు బాబు సిద్ధమైతే తేదీ ప్రకటించమనండి నేను నా కుటుంబంతో కలసి దీక్షలో కూర్చుంటా? సినీ పరిశ్రమ వాళ్లను కూడా అదే వేదికపై దీక్షలో కూర్చోబెడతా. 30 రోజుల్లో ప్రధానమంత్రి మోదీ దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే 31వ రోజు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటా’’ పోసాని కృష్ణమురళి తేల్చిచెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top