అప్పటి వరకు నాకు బ్యాంకు ఖాతా లేదు : మోదీ

PM Narendra Modi Says Have Several Friends in Opposition - Sakshi

న్యూఢిల్లీ : సీఎం అయ్యే వరకు తనకు బ్యాంక్ ఖాతా లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని కావాలని ఏనాడు అనుకోలేదని, సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నానని చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. బయోగ్రఫీలు చదవడమంటే తనకు ఇష్టమని, సన్యాసి జీవితాన్నే ఇష్టపడుతానన్నారు. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటానని, పని చేస్తూ అందరితో పనిచేస్తానని తెలిపారు. అందరితో సరదగా గడపాలని భావిస్తానని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోనన్నారు. తన సమావేశాల్లో ఎవరు సెల్‌ఫోన్లు వాడరని, తాను కూడా ఎవరితోనైనా భేటీ అయితే మొబైల్‌ వాడనన్నారు. అధికారులందిరికీ తాను ఒక స్నేహితుడినని తెలిపారు. 

‘నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిని కాకముందు నాకు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. చిన్నప్పుడు నేను చదువుకుంటున్న స్కూల్‌కి దేనా బ్యాంక్‌ అధికారులు వచ్చారు. మాకు ఓ హుండీ ఇచ్చి అందులో డబ్బు పోగుచేసుకోమనేవారు. ఆ డబ్బును వారు మా ఖాతాల్లో వేస్తామని చెప్పారు. కానీ నేనెప్పుడూ హుండీలో డబ్బు వేయలేదు. ఆ తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రిని అయ్యాక నాకు వచ్చే జీతం డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ అయ్యేది. అలా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వచ్చిన జీతాన్ని అధికారులు నాకు తెచ్చి ఇచ్చినప్పుడు.. దీంతో ఏం చేసుకోవాలి? నాకు ఇచ్చుకోవడానికి ఎవ్వరూ లేరు అన్నాను. అప్పుడు వారు.. ‘సర్‌ ఇంతకుముందు మీపై కొన్ని కేసులు బనాయించినవారు ఉన్నారు. కేసుల నుంచి బయటపడటానికి వకీలును పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారు డబ్బు కూడా ఎక్కువగా తీసుకుంటారు. దానికైనా మీకు డబ్బు ఉపయోగపడుతుంది కదా..’ అన్నారు. కానీ నేను వద్దన్నాను. అప్పుడు సెక్రటేరియట్‌లో డ్రైవర్‌గా, ప్యూన్‌గా పనిచేస్తున్నవారి పిల్లలకు రూ.21లక్షలు ఇచ్చేశాను.’ అని తెలిపారు.

నా దుస్తులు నేను ఉతుక్కునేవాణ్ణి
పాశ్చాత్య ఆహార అలవాట్లతో ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని, అందుకే తనకు ఆయుర్వేదంపై చాలా నమ్మకం ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆహార అలవాట్లకు దూరంగా ఉంటారు కాబట్టే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కునేవాడినని మోదీ తెలిపారు. 

మామిడి పండ్లంటే ఇష్టం..
మామిడి పండ్లంటే తనకు చాలా ఇష్టమని, గుజరాత్‌లో మామిడి పండ్ల రసం బాగా ఫేమస్‌ అన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ తినాలనుకున్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని, నాకు సహజంగా పండిన మామిడి పండ్లు తినడం అంటే ఇష్టమని తెలిపారు. కోసిన తర్వాత మగ్గబెట్టినవి ఇష్టం ఉండవన్నారు.

ఇతర పార్టీల్లో స్నేహితులు ఉన్నారు..
ఇతర పార్టీల్లో కూడా తనకు మంచి స్నేహితులన్నారని మోదీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒకసారి తాను గులాం నబీ ఆజాద్‌ కలిసి బయటికి వెళుతుండగా..  మీడియా వర్గాలు.. ‘అదేంటి.. మీ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటారు కదా..’ అని ప్రశ్నించాయని, దానికి ఆజాద్ చక్కటి సమాధానం ఇచ్చారని తెలిపారు. ‘రాజకీయపరంగా ఎన్నైనా వాదనలు చేసుకుంటాం. కానీ ఇప్పటికీ మా మధ్య స్నేహం పదిలంగా ఉందన్నారని గుర్తు చేసుకున్నారు. అంతెందుకు.. పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ తనకు ఏడాదికి రెండు కుర్తాలు కానుకగా పంపుతుంటారని, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అప్పుడప్పుడూ స్వీట్లు పంపుతుంటారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top