ఆ ధైర్యం ఇప్పుడు లేదయ్యా.. | People says about Aarogyasri problems in front of YS Jagan | Sakshi
Sakshi News home page

ఆ ధైర్యం ఇప్పుడు లేదయ్యా..

Dec 18 2018 3:43 AM | Updated on Dec 18 2018 8:47 AM

People says about Aarogyasri problems in front of YS Jagan - Sakshi

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నారాయణవలసలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో పాటు పాదయాత్రలో నడుస్తున్న అక్కచెల్లెమ్మలు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘మీ నాయన వైఎస్సార్‌ బతికున్నప్పుడు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా చేయించుకునే వాళ్లం. అప్పుడు ఎంతటి పెద్ద ఆస్పత్రికైనా వెళ్లేటంతటి ధైర్యం మీ నాయన ఇచ్చారు. ఇప్పుడా ధైర్యం లేకుండా పోయిందయ్యా. ఆస్పత్రులకు గవర్నమెంటు డబ్బులు ఇవ్వడం లేదట. మేమెలా వైద్యం చేయాలని ఆ కార్పొరేట్‌ ఆస్పత్రుల వాళ్లు నిక్కచ్చిగా చెప్పి వెనక్కు పంపించేస్తున్నారయ్యా’ అంటూ పలువురు బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 323వ రోజు సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జమ్ము నుంచి పాదయాత్ర ప్రారంభించారు. టెక్కలిపాడు క్రాస్, రావాడపేట, చిన్నదూగాం కూడలి, నారాయణవలస, రాణ కూడలి మీదుగా లింగాలవలస వరకు యాత్ర సాగింది.



ఫెథాయ్‌ తుపాన్‌ ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలులు వీస్తున్నా, పోటెత్తిన జనసందోహం మధ్య జగన్‌ యాత్రను కొనసాగించారు. దారిపొడవునా పల్లెల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువత బారులుతీరి ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరల్లో యువకులు భారీగా బాణసంచా కాల్చుతూ జగన్‌ను స్వాగతించారు. దారిపొడవునా వైద్యం అందడం లేదని కొందరు, అర్హత ఉన్నా పింఛన్‌ తీసేశారని మరికొందరు, ఒక జిల్లాలో బీసీలుగా ఉంటే మరో జిల్లాలో బీసీలుగా గుర్తించడం లేదని ఇంకొందరు, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదని పలువురు.. ఇలా అడుగడుగునా  వివిధ వర్గాల ప్రజలు వారి కష్టాలను జగన్‌కు మొర పెట్టుకున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలను ఓపికగా ఆలకించి.. నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందనే ధైర్యం లేకుండా పోయిందని నరసన్నపేటకు చెందిన షేక్‌ సూర్య ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యాహ్నం తర్వాత తుపాన్‌ ప్రభావంతో వర్షం ఎక్కువ కావడంతో ప్రజలు ఇక్కట్లు పడకూడదని భావించిన జగన్‌.. పాదయాత్రను అర్ధంతరంగా ముగించారు.  

అడుగడుగునా కన్నీటి వెతలే..
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించి ఆర్థికంగా ఆదుకున్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డే అని మబగాం గ్రామానికి చెందిన షేక్‌ మదీనా జగన్‌తో చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముస్లింలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం శ్మశాన వాటిక కూడా లేదని, మా కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు నానా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామని, మీ నాయనలా మీరు సీఎం అవ్వడం ఖాయమని అల్లిపురానికి చెందిన వృద్ధుడు ఎడ్ల అసిరయ్య జగన్‌ను ఆశీర్వదించాడు. చేతికందొచ్చిన కొడుకు రామోజీ.. కొబ్బరి చెట్టుపై నుంచి పడి చనిపోతే పరిహారం ఇస్తామని చెప్పి ఆనక ముఖం చాటేశారని జమ్ము గ్రామానికి చెందిన రెడ్డి చిన్నమ్మడు జగన్‌ దృష్టికి తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 అమలు చేసి సామాన్యుడి చెంతకు న్యాయ వ్యవస్థను తీసుకువచ్చేలా చేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులో మాదిరిగానే మున్సిఫ్, జిల్లా కోర్టుల్లో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం స్వీకరించే వెసులుబాటు లభిస్తుందని హైకోర్టు న్యాయవాది సంపత్‌రావు సుధాకర్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.



వైఎస్‌ హయాంలో అందిన పింఛన్‌ను ఈ ప్రభుత్వం వచ్చాక లేకుండా చేసిందని జలుమూరుకు చెందిన గొండ్రు యర్రయ్య కన్నీరు పెట్టుకున్నాడు. తనకు పూర్తిగా కళ్లు కనిపించవని, దివ్యాంగుడినన్న కనికరం లేకుండా తనకు అన్యాయం చేస్తున్నారని రాణ గ్రామానికి చెందిన కిమిడి సూర్య నారాయణ గోడు వెళ్లబోసుకున్నాడు. తమకు వితంతు పింఛన్లు మంజూరు చేయలేదని లింగాలవలసలో బంగారి ఇల్లమ్మ, రావిపాడు గ్రామానికి చెందిన పలిశెట్టి అనురాధం ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు లంచం ఇచ్చినా పింఛన్‌ ఇవ్వడం లేదని బాధపడ్డారు. అంత్యోదయ కార్డుకు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా, తిరిగి తిరిగి కాళ్లరిగి పోతున్నాయి తప్ప ఫలితం లేదని నారాయణ వలసలో ఎస్‌.మోహనరావు జగన్‌తో చెప్పుకున్నాడు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

ఆరోగ్యశ్రీ అందడం లేదయ్యా.. 
సార్‌.. నాకు రహదారి ప్రమాదంలో కాలికి గాయమైంది. ఎంతగా ప్రయత్నించినా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరగలేదు. దీంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటే అది విఫలమైంది. రెండోసారి చేయించుకున్నా అదే పరిస్థితి. లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే రూ.మూడు లక్షలు అవుతుందంటున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు.  
– షేఖ్‌ సూర్య, నరసన్నపేట

ఉద్యోగాలివ్వడం లేదన్నా..
అన్నా.. మీ నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 800 పోస్టులు భర్తీ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు 1,200 ఖాళీలున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలకు ఇష్టానుసారం అనుమతులివ్వడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మీరు సీఎం కాగానే ఈ పరిస్థితి మార్చాలి.
– పి.మల్లేశ్వరరావు, ఇతర నిరుద్యోగులు 

పొందర్లను బీసీలుగా గుర్తించాలి
సార్‌.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో పొందర్లను బీసీ–ఏ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మాత్రమే బీసీలుగా గుర్తిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో బీసీల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో కూడా బీసీలుగా గుర్తింపు ఇవ్వాలి. వృత్తిరీత్యా కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నాం. మాకు సంక్షేమ పథకాలు అందడం లేదు. సొంత ఇళ్లు కూడా లేవు. మీరు సీఎం కాగానే మమ్మల్ని ఆదుకోవాలి.  
– రాజాపు అప్పన్న, పొందర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, నరసన్నపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement