‘పవన్‌’ పాయింట్‌ ప్రజెంటేషన్‌ | Sakshi
Sakshi News home page

‘పవన్‌’ పాయింట్‌ ప్రజెంటేషన్‌

Published Mon, Mar 18 2019 7:29 AM

Pawan Point Presentation - Sakshi

జనసేన పార్టీ కార్యాలయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలా అటెన్షన్‌లో నిల్చుని ఉన్నాడు జేడీ లక్ష్మీనారాయణ. నల్లటి ప్యాంటు మీదికి తెల్లటి పొడవాటి హాఫ్‌హ్యాండ్స్‌ చొక్కా వదిలేసి ఉంది. లోపలికి వచ్చేటప్పుడు ‘టక్‌’ పైకి లాగేసుకుని వచ్చాడేమో.. షర్ట్‌ ముడతలు పడి ఉంది. 
ఎదురుగా పవన్‌కల్యాణ్‌ నిల్చుని ఉన్నాడు. జేడీ వచ్చాడని పవన్‌కల్యాణ్‌ లేచి నిల్చున్నాడా, పపన్‌కల్యాణ్‌ ఆల్రెడీ లేచి నిల్చునే ఉండడంతో జేడీ కూర్చోడానికి మొహమాటపడ్డాడా తెలియడం లేదు. ఇద్దరూ నిల్చునే ఉన్నారు. ఆ ఇద్దరే ఉన్నారు ఆ గదిలో. 
 ‘టక్‌’ లేకపోయినా జేడీ జేడీలానే ఉన్నాడు. అవే బుగ్గలు. అదే క్లీన్‌ షేవ్డ్‌ గడ్డం. పవన్‌కల్యాణ్‌ మాత్రం పవన్‌కల్యాణ్‌లా లేడు. అల్లూరి సీతారామరాజులా ఉన్నాడు. చేగువేరాలా ఉన్నాడు. మావోయిస్టు వ్యూహకర్తలా ఉన్నాడు. కొంచెం కమ్యూనిస్టు కార్యకర్తలా కూడా ఉన్నాడు. జుట్టుకి, గడ్డానికి, మీసాలకు తెల్లరంగు వేస్తే ఆ తెల్లటి లాల్చీ, వదులు పైజమాలో ఏదో ఒక యాంగిల్‌లో బక్కచిక్కిన నరేంద్ర మోదీలానూ ఉండేలా ఉన్నాడు.  
పవన్‌ కుర్చీ ఖాళీగా ఉంది. జేడీ కూర్చోడానికి మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అయినా ఇద్దరూ కూర్చోలేదు. నిల్చునే ఉన్నారు. మాట్లాడుకోవడం లేదు. మధ్యమధ్య మాత్రం ఒకర్నొకరు చూసుకుంటున్నారు. గదిలో గోడ మీద స్క్రీన్‌ ఉంది. పవన్‌కల్యాణ్‌ చేతిలో రిమోట్‌ ఉంది. పవన్‌ ఏ క్షణమైనా తనకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వబోతున్నట్లు జేడీ అర్థం చేసుకున్నాడు. తన పాయింట్‌ ఏదైనా, వినేందుకు జేడీ సిద్ధమై వచ్చాడని పవన్‌ అర్థం చేసుకున్నాడు. 
‘‘బీజేపీలో బెర్త్‌ లేదు. భీమ్లీలో సీటు లేదు. లోక్‌సత్తాలో సత్తాలేదు. సొంతంగా పార్టీ పెట్టుకునే సీన్‌ లేదు. జగన్‌కి చూపించడానికి మీ దగ్గర ఫేస్‌ లేదు.. అందుకే ఇటొచ్చారు. యామ్‌ ఐ రైట్‌?’’ అన్నాడు పవన్‌కల్యాణ్‌. 
‘‘అదేం కాదు. మీ సిద్ధాంతాలు నచ్చి ఇటొచ్చాను’’ అన్నాడు జేడీ. 
‘‘మా సిద్ధాంతాలు మీకు నచ్చడం కాదు.. మీ సిద్ధాంతాలు మాకు నచ్చాలి.. అ..’’ అన్నాడు పవన్‌. 
‘నాకో సిద్ధాంతం లేదు..’ అనబోయి ఆగాడు జేడీ. 
‘‘ఏదో అనబోయి ఆగారూ..’’ అన్నాడు పవన్‌. 
‘‘అనబోయి కాదు.. అనుకోబోయి ఆగాను. మీ సిద్ధాంతమే నా సిద్ధాంతం’’ అన్నాడు జేడీ. 
‘‘అనుకోబోయి ఆగడం మా సిద్ధాంతం కాదు. అనుకోనిది కూడా ఆగకుండా అనేస్తాం’’ అన్నాడు పవన్‌. 
‘‘నేనన్నది.. అనుకోబోయి ఆగడం, అనుకోనిది కూడా ఆగకుండా అనేయడం గురించి కాదు, మీ సిద్ధాంతం గురించి అన్నాను. మీరు రెండూ కలిపి అర్థం చేసుకున్నట్లున్నారు’’ అన్నాడు జేడీ.
‘‘సమాజంలో అర్థమవడం, అర్థకాకపోవడం, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోలేకపోవడం ఇవేవీ ఉండవు జేడీ గారూ. పేదరికం ఒక్కటే ఉంటుంది. గ్లాసు నీళ్లకు పేదరికం, నోటి ముద్దకు పేదరికం, పది నోటుకు పేదరికం. ఈ పేదరికానికి కారణం ఢిల్లీలో నరేంద్రమోదీ, ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌. పేదరికం ఎక్కడున్నా సరే, అక్కడికి వెళ్లి పేదరికాన్ని నిర్మూలించడం జనసేన సిద్ధాంతం’’ అన్నాడు పవన్‌. 
‘‘జగన్‌ని మర్చిపోయినట్లున్నారు. పేదరికంలో జగన్‌కేమీ పార్ట్‌ లేదా?’’ అన్నాడు జేడీ.
‘‘పేదరికంలో జగన్‌ పార్ట్‌గా ఉన్నాడు గానీ, పేదరికంలో జగన్‌ పార్ట్‌ ఏమీ లేదు జేడీ గారూ’’ అన్నాడు పవన్‌. 
‘‘అర్థంకాలేదు’’ అన్నాడు జేడీ. 
‘‘జగన్‌ పాదయాత్రను ఫాలో అయి ఉంటే మీకు అర్థమై ఉండేది’’ అన్నాడు పవన్‌. 
‘‘మీరు ఫాలో అయ్యారా జగన్‌ పాదయాత్రని?!!’’.. అడిగాడు జేడీ. 
‘‘పేదరికం ఎక్కడున్నా జనసేన ఫాలో అవుతుంది జేడీ గారూ’’ అన్నాడు పవన్‌.
జేడీకి అర్థమైంది. కూర్చోమని సీటే ఇవ్వనివాడు, నిలబడడానికి సీటేమిస్తాడు అనుకున్నాడు. ‘‘నమస్తే.. వెళ్లొస్తా’’ అన్నాడు. 
‘‘జేడీగారూ.. చిన్న మాట. దాహమైనప్పుడు బావిని తవ్వుకోలేం. దాహమౌతుందేమోనని బావిని తవ్వుకుని ఉంచుకోవాలి. రిటైర్‌ అవ్వగానే మీకో పార్టీని తవ్వుకుని ఉండాల్సింది.. సారీ, మీరో పార్టీని పెట్టుకుని ఉండాల్సింది’’ అన్నాడు పవన్‌. 
‘‘సరే, వెళ్లొస్తా.. నమస్తే’’ అన్నాడు జేడీ.
‘‘జేడీగారూ ఇంకో మాట’’ అన్నాడు పవన్‌.
జేడీ ఆగాడు. 
‘‘పాపం.. ఎంత దాహంతో ఉన్నారో.. ఈ గ్లాసు నీళ్లు తాగి వెళ్లండి’’ అని, నీళ్ల గ్లాసు అందించాడు పవన్‌.  
– మాధవ్‌

Advertisement
Advertisement