మళ్లీ అదే ‘సాధింపు’

Pawan kalyan Long March Failed in Visakhapatnam - Sakshi

బండబూతులు తిట్టిన వెలగపూడికి మాత్రం మినహాయింపు

వైఎస్సార్‌ సీపీ నేతలపై విమర్శలకే కవాతు

పవన్‌ ఒక్క అడుగు రోడ్డు మీద వేయకుండానే ముగిసిన మార్చ్‌

షో పవన్‌ది.. నడక ఫ్యాన్స్‌ది

బలప్రదర్శనగా సాగిన ‘పసుపు’ సేన షో

పవన్‌కు టీడీపీ మద్దతు, ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటాయన్న మాజీ మంత్రి అయ్యన్న

ఔను...  ఊహించినట్టుగానే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మళ్లీ అదే ’సాధింపు’ మాటలే మాట్లాడారు.భవన నిర్మాణ కార్మికుల సమస్యల పేరిట ఆదివారం నగరంలో చేపట్టిన లాంగ్‌ మార్చ్‌లో పవన్‌ ఏకంగా 55 నిమిషాలు గుక్కతిప్పుకోకుండా ప్రసంగించారు.ఇందులో సమస్యపై మాట్లాడింది ఐదు నిమిషాలైతే... అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలకు కేటాయించింది 50 నిమిషాలు.అవి కూడా రాజకీయపరమైన విమర్శలు కాదు.. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూనే మాట్లాడారు.

కానీ విచిత్రంగా తనను ఇదే విశాఖ నగరంలో ము... నాయాలు అని దారుణంగా తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును మాత్రం పల్లెత్తి మాట అనలేదు.అదే తెలుగుదేశం పార్టీ నేతలను పక్కనపెట్టుకుని మరీ సంబరపడ్డారు.ఇక కవాతు చేస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఎంచక్కా వాహనం ఎక్కి సినిమా ఫంక్షన్‌ మాదిరి చేతులు ఊపుతూ రాగా.. పాపం.. కార్యకర్తలు, ఆయన అభిమానులే రెండున్నర కిలోమీటర్ల మేర మార్చ్‌ చేపట్టారు.కనీసం పవన్‌ రోడ్డుపై ఒక్క అడుగు కూడా వేయకుండానే ఇసుక సమస్య పేరిట టీడీపీ, జనసేన కలిసి బలప్రదర్శన మాదిరి షో చేశారన్న అభిప్రాయాన్నే కలిగించారు.

అభిమానులపై అసహనం వ్యక్తం చేస్తున్న పవన్‌
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:భవన నిర్మాణ కార్మికుల సమస్యల పేరిట జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం నగరంలో చేపట్టిన కవాతు అనంతరం జరిగిన బహిరంగ సభ ఆసాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై విమర్శలకే పరిమితమైంది. రాజకీయపరమైన విమర్శలకు పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణలకు పవన్‌ కల్యాణ్‌ దిగడం ఆశ్చర్యం కాకపోయినా... ఇంకా ఆయనలో మార్పు రాలేదన్న సంగతి స్పష్టం చేసింది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు అంబటి రాంబాబును, మంత్రి కురసాల కన్నబాబునుద్దేశించి చేసిన పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు ఓ రకంగా ఏవగింపునే కలిపిస్తున్నాయి. అంబటి రాంబాబు కుమార్తె పెళ్లికి వెళ్లానని, అయినా సరే ఆయన తన్ను విమర్శిస్తున్నారని, ఇప్పుడు ఆయన ఇంటి ముందుకొచ్చి మాట్లాడితే ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు.

ఇక వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబునైతే అదే సాధింపు మాటలతో తిట్టిపోశారు. తన సోదరుడు నాగబాబు రాజకీయాల్లోకి తీసుకువస్తే.. ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఆయన బతుకు మాకు తెలియదా... అని విమర్శించారు. ఇలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగిన పవన్‌ కల్యాణ్‌... తనను దారుణంగా బండబూతులతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును మాత్రం పల్లెత్తి మాట అనలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజురాత్రి వెలగపూడి.. నేరుగా పవన్‌ను పత్రికల్లో రాయలేని భాషతో దూషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వెలగపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు సైతం కవాతులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక టీడీపీ నేతలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ, జనసేన ఒక్కటేనన్న భావాన్ని కలిగించారు. జనసేన పవన్‌కు ఎప్పుడూ టీడీపీ మద్దతు, ఆశీర్వాదం ఉంటాయని అయ్యన్న స్పష్టం చేశారు.

పోలీసులపై విమర్శలు

పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేసినప్పటికీ పోలీసు అధికారులపై సోదరుడు నాగబాబు సహా పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పక్కాగా ఏర్పాట్లు చేసినప్పటికీ తమకు సరైన బందోబస్తు ఇవ్వలేదని విమర్శించారు. స్వయంగా నాగబాబే .. తమకు 90 మంది సిబ్బందితో పోలీసులు బందోబస్తు కల్పించారని చెబుతూనే విమర్శలు చేశారు.

జనసేన కవాతులో టీడీపీ శ్రేణుల హల్‌చల్‌
వాహనం పైనుంచే షో
లాంగ్‌ మార్చ్‌ అంటే పవన్‌ కల్యాణ్‌ కూడా నడుస్తాడని అందరూ అనుకున్నారు. ఆయన ఫ్యాన్స్‌ కూడా ఆదే ఆశించారు. కానీ పవన్‌ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండానే వాహనం ఎక్కేశారు. స్పెషల్‌ ప్లయిట్‌లో మధ్యాహ్నం బెంగళూరు నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆయన సాయంత్రం 4.40 గంటలకు మద్దిలపాలెం వద్ద కవాతులో పాల్గొన్నారు. పవన్‌ కూడా నడుస్తారని అందరూ భావించగా, ఆయన మాత్రం తొలుత ఫొటోగ్రాఫర్స్‌ కోసం ఏర్పాటు చేసిన వెహికల్‌ ఎక్కారు. తర్వాత పార్టీ నేతలు ఏర్పాటు చేసిన వాహనం ఎక్కి అభిమానులు, కార్యకర్తలకు చేతులూపుతూ ముందుకు సాగారు. మొత్తంగా అభిమానులు, కార్యకర్తలు మాత్రమే నడవగా, ఈయన మాత్రం సినిమా ఫంక్షన్‌కు వచ్చిన మాదిరి ’షో’ చేస్తూ బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు.

డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళ
కవాతుకు అద్దె జనం
కవాతుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారన్నప్పటికీ.. జనాలను పెద్ద ఎత్తున తరలించారు. మనిషికి రూ.250 ఇస్తారని చెప్పి రూ.150 ఇచ్చారని సభా వేదిక వద్ద వాదనకు దిగడం కనిపించింది. 13 జిల్లాల నుంచి అభిమానులను తరలించినప్పుటికీ ఆశించిన మేర మార్చ్‌లో జనాలు కనిపించకపోవడంతో చివరికి అద్దె జనాలనే నమ్ముకోవల్సి వచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top