జాక్‌పాట్‌ కొట్టిన శరద్‌ పవార్‌.. ప్రభుత్వంలో కీ రోల్‌

NCP May Get Big In Portfolio In Maharashtra Cabinet - Sakshi

ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న శరద్‌ పవార్‌

కీలక శాఖలన్నీ ఎన్సీపీకే

అజిత్‌కు ఆర్థిక, అనిల్‌కు హోంమంత్రి!

సాక్షి, ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. ప్రభుత్వంలోనూ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు శివసేన చీఫ్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. డిసెంబర్‌ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. కాగా శాఖల కేటాయింపు కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పర్యావరణ, పర్యాటక శాఖ ఇస్తారని సమాచారం. సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ శాఖ కావాలని పట్టుబట్టినా శివసేన అంగీకరించలేదని తెలుస్తోంది.(సీనియర్లకు చోటేది.. భగ్గుమన్న అసంతృప్తులు!)

కాగా మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ వారికి ఇంకా శాఖలను కేటాయించని విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. శాఖల అప్పగింతపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన హోంమంత్రిత్వశాఖను ఎన్సీపీ సీనియర్‌ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు అప్పగించే యోజనలో ఉద్ధవ్‌ ఉన్నారని తెలిసింది. అలాగే ఏక్‌నాథ్‌ షిండేకు పట్టణాభివృద్ధిశాఖ, శుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలు, బాలాసాహెబ్‌ తోరట్‌కు రెవెన్యూ, కార్మిక, ఎక్సైజ్‌శాఖ దిలీప్‌ వాల్సే పాటిల్‌కు, ఆరోగ్య వర్షా గైక్వాడ్‌కు, సామాజిక న్యాయం ధనుంజయ్‌ మూండేకే దక్కే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు శరద్‌ పవార్‌, ఉద్ధశ్‌ ఠాక్రే మధ్య అంగీకారం కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారి తీసిన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక శదర్‌ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి వారిని ఒప్పంచడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో ఎన్సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ను సైతం వెనక్కిరప్పిచడంలో శరద్‌ రచించిన వ్యూహం విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటులో శరద్‌ పవాద్‌కే ముఖ్యపాత్ర అని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సైతం అభిప్రాయపడ్డారు. దీంతో కీలక శాఖలను ఎన్సీపీకి అప్పగించేదుకు సైతం ఠాక్రే వెనుకాడట్లేదని తెలుస్తోంది. మరోవైపు శాఖల కేటాయింపులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కీలకశాఖలన్నీ శివసేన, ఎన్సీపీ దక్కేఅవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ మంత్రులు ముందుగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణతీ షిండే ఇప్పటికే ఆందోళలకు దిగిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top