సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం 

Narendra Modi And BJP Marvellous Victory In 2019 Election - Sakshi

బీజేపీ కూటమికి 348.. కాంగ్రెస్‌ కూటమికి 92

2014తో పోలిస్తే ఎన్డీయేకు 16 సీట్లు ఎక్కువ

రాజస్తాన్, గుజరాత్, హరియాణాల్లో క్లీన్‌స్వీప్‌

51 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ..

అమేథీలో ఓడిన రాహుల్‌.. వాయనాడ్‌లో ఘన విజయం

జోష్‌లో బీజేపీ శ్రేణులు..

ప్రధాని మోదీ కరిష్మాకు యావద్భారతం మరోసారి జై కొట్టింది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ అన్న నరేంద్రుని నినాదానికి ఫిదా అయిపోయింది. కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించి సిలిండర్లు ఇవ్వడం.. మహిళల గౌరవానికి భంగం కలగకుండా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఓ యజ్ఞంగా నిర్వహించడం, విద్యుత్‌ లేని వేల గ్రామాల్లో వెలుగులు తీసుకొచ్చినా అది నరేంద్రుడి చలవేనని బలంగా నమ్మింది. ఇళ్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా గూడు కల్పించడంతో మోదీని వాళ్లింట్లో ఒకడిగా భావించింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠినమైన నిర్ణయాలతో ఇబ్బంది పడ్డా.. అవినీతిరహిత పాలన అందించడం.. ఇబ్బందిగా మారిన ఆదాయపన్ను పరిమితిని పెంచడంతో మోదీ తమ సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా విశ్వసించింది. విపక్షాలు ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని విమర్శించినా.. జన్‌ ధన్‌ అకౌంట్లు, ముద్ర లోన్లు, స్కిల్‌ ఇండియా వంటి పథకాలతో తమ అవసరాలను తీర్చిన మోదీ మరోసారి వస్తేనే బాగుంటుందని బలంగా నమ్మింది. అందుకే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీని కట్టబెట్టి ‘జయహో మోదీ’ అని నినదించింది. కేంద్రంలో హంగ్‌ తప్పదని.. ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయంటూ వచ్చిన విశ్లేషణలన్నింటినీ తప్పని నిరూపిస్తూ బీజేపీకి 303 సీట్లతో బంపర్‌ మెజారిటీని కట్టబెట్టింది. విపక్షాలను కోలుకోలేని దెబ్బకొట్టింది. కాంగ్రెస్‌కు మరోసారి ప్రతిపక్ష పార్టీ హోదా దక్కకుండా 51 స్థానాలకే పరిమితం చేసింది. ఇక ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం, తమిళనాడులో డీఎంకే మినహా.. మిగిలిన ప్రాంతీయ పార్టీల కోటలన్నింటిలో విజయవంతంగా బీజేపీ పాగా వేసింది. బీజేపీ దెబ్బకు కంచుకోట అమేథీలో రాహుల్‌ ఓటమిపాలయ్యారు. అయితే వాయనాడ్‌లో గెలిచి పరువు దక్కించుకున్నారు. దీనికితోడు విపక్ష పార్టీలో మోదీకి సరితూగే వ్యక్తి లేకపోవడంతో మరో ఐదేళ్లపాటు ‘నమో నమః’ తమ మంత్రమని ప్రజలు స్పష్టంచేశారు. దేశ చరిత్రలో వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్న కాంగ్రెసేతర నేతగా రికార్డు సృష్టించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. విపక్షాలన్నీ ఏకమైనా ఎన్డీయే కూటమి జోరును అడ్డుకోవడం సాధ్యం కాలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 348 స్థానాల్లో గెలవగా.. బీజేపీ ఒంటరిగా 303 చోట్ల ఘనవిజయం సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయేకు 16 సీట్లు ఎక్కువగా.. బీజేపీకి 21 సీట్లు ఎక్కువగా వచ్చాయి. జాతీయత, దేశ భద్రత, పేదలు, మధ్యతరగతి సంక్షేమం, నవభారత నిర్మాణం వంటి బీజేపీ ప్రచారాంశాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీని ఫలితమే.. వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగినా బీజేపీ బ్రహ్మాండంగా సొంత మెజారిటీని సాధించింది. గతేడాది హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా.. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. మోదీ హవాలో విపక్షాలు కొట్టుకుపోయాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలింది.

రాహుల్‌ను ప్రధాన మంత్రిగా ప్రొజెక్ట్‌ చేసినా.. ప్రియాంక వాద్రాను రంగంలోకి దించినా కాంగ్రెస్‌ తలరాత ఏమాత్రం మారలేదు. ఏడాదికి 72వేల కనీస ఆదాయ పథకం (న్యాయ్‌)ను ప్రకటించినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. బీజేపీ విజయం సాధించిన అన్ని రాష్ట్రాల్లోనూ 50శాతానికిపైగా ఓట్లు పొందడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీలో మహామహులు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. కర్ణాటకలోని కల్బుర్గి నుంచి పోటీ చేసిన లోక్‌సభలో పార్టీ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, మధ్యప్రదేశ్‌నుంచి బరిలో దిగిన జ్యోతిరాదిత్య సింధియా, భోపాల్‌ నుంచి పోటిచేసిన దిగ్విజయ్‌సింగ్‌ వంటి ముఖ్యనేతలు ఓడిపోయారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఒక్కసీటు కూడా గెలవకపోవడం గమనార్హం. బీజేపీ మాత్రం పశ్చిమబెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో సత్తాచాటింది. తమిళనాడులో డీఎంకే 23 సీట్లలో కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 19 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా యూపీఏ 92 స్థానాలను కైవసం చేసుకుంది. 

మోదీ రికార్డుల మోత 
వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రెసేతర నేతగా మోదీ నిలిచారు. దీంతోపాటుగా.. తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత వరుసగా రెండుసార్లు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డులకెక్కారు. ఎన్నికల ప్రచారంలో చేసుకున్న విమర్శలను మరిచిపోయి.. నవభారత నిర్మాణానికి అందరూ భాగస్వాములై పనిచేద్దామని విపక్షాలను మోదీ కోరారు. ఘన విజయం అనంతరం సాయంత్రం పార్టీ కార్యాలయానికి వచ్చిన మోదీ, షాలకు కార్యకర్తలు నేతలనుంచి ఘనస్వాగతం లభించింది. రెండు చేతులకు పైకెత్తి నరేంద్ర మోదీ విక్టరీ సింబల్‌ చూపించడంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘నమో అగైన్, చౌకీదార్‌ ఫిర్‌సే, ఫిర్‌ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’అని నినాదాలు చేశారు. గురువారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైన కాసేపటి నుంచే బీజేపీ ప్రభంజనం కనిపించింది. 10–11గంటల సమయంలోనే గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీని బీజేపీ దాటిపోతుందనే భావన వ్యక్తమైంది.

ఒక దశలో 300 సీట్లు దాటిపోవడం కూడా పెద్ద కష్టమేం కాదనిపించింది. కౌంటింగ్‌ కొనసాగుతున్న కొద్దీ.. బీజేపీ స్థానాల మీటర్‌ పెరుగుతూనే పోయింది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతున్న మోదీపై దేశ ప్రజల ప్రేమ కూడా కౌంటింగ్‌లో కనిపించింది. దేశ సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఏకపక్షంగా ప్రభావం చూపించింది. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అమేథీలో రాహుల్‌ ఓటమి పాలయ్యారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇక్కడ ఘన విజయం సాధించారు. అయితే కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ 8లక్షల పైచిలుకు బంపర్‌ మెజారిటీతో గెలిచారు. కాగా, ఈ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీల కార్యాలయా ల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు స్వీట్లు పంచుకుని డ్యాన్స్‌లు చేశారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే కేరళ మినహా ఢిల్లీ సహా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్‌ కార్యాలయాలు మాత్రం బోసిపోయాయి.  

కాంగ్రెస్‌ నాయకత్వంపై అనుమానాలు 
తాజా సార్వత్రిక ఫలితాలతో కాంగ్రెస్‌లో గాంధీ నాయకత్వంపై, పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్‌.. శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ‘దేశ ప్రజలు నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. ప్రధాని మోదీకి అభినందనలు’అని పేర్కొన్నారు. బీజేపీ విజయంపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘన విజయానికి కారణమైన మోదీ, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ‘అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న భారత ఆశలు, ఆకాంక్షలను ఎవరూ అడ్డుకోలేరు. కుటుంబరాజకీయాలు, కుల రాజకీయాలను ప్రజలు హర్షించరు’అని జైట్లీ ట్వీట్‌ చేశారు. తాజా ఫలితాలతో కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న పాపులారిటీ మరింత పెరిగిందనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని జైట్లీ తెలిపారు. ఐదేళ్లలో మోదీ చేపట్టిన కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు ప్రజామోదం ఉందనేది సుస్పష్టమైందన్నారు. బాలాకోట్‌లో పాక్‌ మిలటరీ స్థావరాలపై దాడులు, జాతీయవాదం, హిందుత్వ తదితర అంశాలు కూడా ప్రచారంలో బీజేపీ వైపు మెజారిటీ ప్రజలు మొగ్గేలా చేశాయని జైట్లీ తెలిపారు.

విపక్షాలను నమ్మలేదు 
హరియాణాలోనూ బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం పదిస్థానాలను గెలుచుకుని మోదీ బంపర్‌ విజయంలో భాగస్వామ్యమైంది. ‘విపక్షాలు చెప్పిన అబద్ధాలను క్షేత్రస్థాయిలో ప్రజలు నమ్మలేదు. వచ్చే ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీదే కావాలని ప్రజలు భావించారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో ఆరో అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మోదీ తీసుకున్న నిర్ణయాలను చూశారు. అందుకే మరోసారి మోదీకి పట్టంగట్టారు’అని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు. ఒడిశాలో బీజేపీ ఐదు ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలుపొందిన బీజేడీ.. ఈసారి 15 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు నవీన్‌ పట్నాయక్‌కే పట్టంగట్టారు.

హిందీ బెల్ట్‌లో ఊహించని రీతిలో..
మోదీ హవా కారణంగానే బీజేపీ ఈ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందనేది సుస్పష్టం. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోనూ సమాజ్‌వాదీ పార్టీ–బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. బీజేపీ 60 స్థానాల్లో గెలుపొందడం పెద్ద విషయమే. దీంతో లక్నోలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. కాషాయ జెండాలు పట్టుకుని టపాసులు పేలుస్తూ కార్యకర్తలు నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కార్యాలయాలు బోసిపోయాయి. ‘పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఇవే ఫలితాలు నిజమైతే పార్టీ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ పేర్కొన్నారు. బీజేపీకి 2014 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రావడంలో యూపీ సహా హిందీ బెల్ట్‌ కీలకం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. అయితే.. ఈ ఫలితాలే పునరావృతమైతే.. మరోసారి మోదీ ప్రధాని కావడం కష్టమేననే విశ్లేషణలు వినిపించాయి. అయితే వీటికి భిన్నంగా బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో సత్తా చాటింది.

అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైన రాజస్తాన్‌లోనైతే పూర్తిగా స్వీప్‌చేసి ఔరా అనిపించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లోనూ దాదాపుగా స్వీప్‌ చేసింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో తగ్గే సీట్లను తూర్పు రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, ఒడిశాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కొంతైనా భర్తీ చేసుకోవాలనే లక్ష్యంతో రెండేళ్లుగా కార్యాచరణ ప్రారంభించిన బీజేపీ అధిష్టానం.. ఆ దిశగా విజయం సాధించింది. మమతా బెనర్జీ కంచుకోటలో 18 సీట్లతో సత్తా చాటింది. నవీన్‌ పట్నాయక్‌ కోటలోనూ పాగా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో గతంలో కంటే సీట్లను మెరుగుపరుచుకుంది. గతంలో ఒక్క సీటున్న తెలంగాణలో ఈసారి నాలుగు స్థానాల్లో గెలిచి సత్తాచాటింది. అయితే దక్షిణాదిన బీజేపీకి కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో మాత్రం ఘోరపరాభవం తప్పలేదు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. కాగా, ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

వారణాసిలో మోదీ.. గాంధీనగర్‌లో షా 
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ 4.3 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించారు. ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటినుంచీ మోదీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్లారు. ‘కలిసి అభివృద్ధిలో భాగమవుదాం. కలిసి సమృద్ధిని సాధించుకుందాం. కలిసి సమగ్ర, బలమైన భారతాన్ని నిర్మించుకుందాం. భారత్‌ మరోసారి గెలిచింది’అని విజయానంతరం మోదీ ట్వీట్‌ చేశారు. అటు బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి బరిలో దిగిన అమిత్‌ షా 5.5 లక్షల ఓట్లతో అద్భుత విజయం సాధించారు. ఎన్నికల ప్రచారం చివర్లో బీజేపీ ‘అబ్‌కీ బార్‌ 300 పార్‌’ #(ఈసారి కచ్చితంగా 300 దాటేస్తాం) అనే నినాదాన్ని బలంగా వినిపించింది. ఇది కూడా ప్రజల్లో బీజేపీ హవాను మరింత బలంగా తీసుకెళ్లేందుకు కారణమైంది. మరోవైపు, మోదీపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం.. చౌకీదార్‌ చోర్‌హై అంటూ విమర్శించడం కూడా ఓటర్లలో విపక్షాలపై ఆగ్రహానికి ఆజ్యం పోసింది. దీని కారణంగానే బీజేపీ విజయం సాధించిన అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓట్‌ షేర్‌ 50% దాటింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top