
సాక్షి, నాగర్‌కర్నూల్: తాను బీజేపీని వీడుతున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు. అనుచరులు, అభిమానుల సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీలో అనేక సందర్భాల్లో అవమానాలకు గురి కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవజ్ఞుడిని ఆ పార్టీ వినియోగించుకోలేక పోయిందన్న బాధ ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై తాను రాజీలేని పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు.
అవినీతి ఊబిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకుగాను కేసీఆర్ వ్యతిరేక శక్తులతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది అభిమానులు, నియోజకవర్గాల ప్రజలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని, ఇవే తనకు చివరి ఎన్నికలని నాగం పేర్కొన్నారు.