కేసీఆర్‌ పతనం చూడటమే లక్ష్యం : మోత్కుపల్లి

Motkupalli Narasimhulu Fires On CM KCR In Delhi BJP Office - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్‌ పతనం చూడటమే లక్ష్యమని మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మెదటిసారిగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీర్‌ను ఎనిమిదో నిజాంతో పోల్చారు. ‘కేసీఆర్‌ను పదవి నుంచి దించేయాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నాను. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బతికే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో దళితుల అభివృద్ధే నాకు ముఖ్యం. కేసీఆర్ సీఎం అయ్యాక.. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఫీజు రీయింబుర్స్ మెంట్ అమలుచేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి కీర్తిప్రతిష్టలు పెరిగాయి. గతంలో 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు.. దళితుడిగా గర్విస్తున్నాను’ అని అన్నారు.

టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చమరగీతం పాడటామికే మోత్కుపల్లి బీజేపీలో చేరారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘రాష్ట్రంలోనే సీనియర్ నాయకుల్లో మోత్కుపల్లి ఒకరు. మోత్కుపల్లి సేవలు తెలంగాణ బీజేపీకి అవసరం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే మా లక్ష్యం. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు లేదు. టీఆర్ఎస్ హయాంలో మున్సిపాల్టీలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. రాష్ట్రం నిధులతో పాటు.. కేంద్ర నిధులను సైతం గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాలిటీలకు తరలించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మజ్లిస్ కు ఓటు వేసినట్లే. ఎంఐఎం కోసమే ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేశారు.’ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డ మోత్కుపల్లికి బీజేపీ సాదర స్వాగతం పలుకుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యంమని వ్యాఖ్యానించారు. బీజేపీ బలోపేతానికి మోత్కుపల్లి సేవలను ఉపయోగించుకుంటామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top