
1972 నుంచి 1984 వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మిజోరం 1987లో రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు రెండేళ్లకు ఎన్నిక అనివార్యం కాగా.. 1989 నుంచి వరుసగా ఐదేళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటినుంచి మొత్తం ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ నాలుగుసార్లు (20 ఏళ్లు), మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎమ్మెన్‌ఎఫ్) రెండుసార్లు (పదేళ్లు) అధికారంలో ఉన్నాయి.
మొదట్నుంచీ మిజోరంలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీలుగానే కొనసాగింది. అయితే ఈసారి బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో బలంగానే పనిచేస్తుండటం అధికార కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. ఇది మిజోరంలో బీజేపీకి సంస్థాగతంగా బలం పెద్దగా లేకపోయినా.. వరుసగా ఈశాన్య రాష్ట్రాల్లో కమలానికి పెరుగుతున్న పట్టు మిజోరానికీ పాకితే ఏం చేయాలనేదే అసలు ప్రశ్నగా మారింది.
25 ఏళ్లుగా బీజేపీకి భంగపాటే!
1993 నుంచి ప్రతిసారీ బీజేపీ మిజోరంలో పోటీ చేస్తూనే ఉంది. అయినా ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మిజోరంలో అధిక జనాభా అయిన క్రైస్తవులు.. బీజేపీని హిందుత్వ పార్టీగానే చూస్తున్నారు. తమది హిందుత్వంతో కూడిన మైనారిటీ అనుకూల పార్టీ అని కమలనాథులు చెప్పుకుంటున్నారు. దీన్నే ఆయుధంగా మలుచుకున్న కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. మిజోరం సీఎం లాల్ థన్‌వాలా (మంచి నేతగా పేరుంది) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం బీజేపీకి అంత సులభమేం కాదని పరిశీలకులంటున్నారు.
కాంగ్రెస్‌కూ అంత వీజీయేం కాదు
ఈ సారి ఎన్నికలు కాంగ్రెస్‌కు కూడా గట్టి పరీక్షేనని విశ్లేషకులంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రహదారులు వంటి మౌలిక సదుపాయాల లేమి, మద్య నిషేధాన్ని ఎత్తేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు.
ప్రజలకు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ రెండు దఫాలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో రోడ్లు కాస్తంత కూడా మెరుగుపడలేదు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెన్‌ఎఫ్‌లో చేరుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఎమ్మెన్‌ఎఫ్, నేషనల్‌పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), మిజో పీపుల్స్ కన్వెన్షన్ (ఎంపీసీ) వంటి ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ఇవి బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ముప్పుగా మారాయి.
బీజేపీ: ఈశాన్య భారతంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి పట్టులేని ఏకైక రాష్ట్రం మిజోరం. అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో సొంతగా.. మేఘాలయ, నాగాలండ్‌లో సంకీర్ణంలో బీజేపీ అధికారంలో ఉంది. త్రిపురలో కామ్రేడ్ల కంచుకోట ‘సర్కార్’ను గద్దెదింపి అధికారం చేపట్టింది. కానీ.. ఇప్పటివకు బీజేపీ పట్టుకు చిక్కని మిజోరం ఇకనైనా ఆ అవకాశాన్నిస్తుందా? క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండే మిజోల గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందా? కాంగ్రెస్ ముక్త్ ఈశాన్య భారత్ నినాదంలో బీజేపీ విజయం సాధిస్తుందా?
కాంగ్రెస్ బొమ్మతో: ఈశాన్య భారతంలో ఒక్కోరాష్ట్రంలో పట్టుకోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో బలమున్న రాష్ట్రం మిజోరం మాత్రమే. ఇప్పటికే ప్రాంతీయ పార్టీ అయిన ఎమ్మెన్‌ఎఫ్ జోరును తట్టుకుని నిలబడుతున్న హస్తానికి.. బీజేపీ నుంచీ పోటీ తోడయితే పరిస్థితేంటి? క్రిస్టియన్ ఓటుబ్యాంకుపైనే నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలదా? నాలుగుసార్లు అధికారంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును కాపాడుకోగలదా? బీజేపీ హిందుత్వ ట్యాగ్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?
కీలకాంశాలు
♦ అత్యంత కీలకమైన అంశంగా మద్యనిషేధం
♦ బీజేపీ గెలిస్తే హిందూ రాష్ట్రంగా మారుస్తారంటూ కాంగ్రెస్ ఆరోపణలు
♦మిజోరంలో చక్మాల జనాభా 90 వేలు. వీరికి టికెట్లు ఇవ్వొద్దంటూ మిజోరం ఎన్జీవో సమితి హెచ్చరికలను బేఖాతరు చేసిన అన్ని పార్టీలు.
♦ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు
♦ బీజేపీలో చేరిన మిజో అసెంబ్లీ స్పీకర్ హిఫే, మాజీ మంత్రి బీడీ చక్మా, మరో సీనియర్ నేత, చక్మాల నేత బుద్ధధన్ చక్మా
♦ఎమ్మెన్‌ఎఫ్‌లోకి కాంగ్రెస్ నేతల వలసలు
ఎవరి ధీమా వారిదే!
రైతులకు అవసరమైనంత సాగుభూమిని పంపిణీ చేసే న్యూలాండ్స్ యూజ్ పాలసీ (ఎన్నెల్‌యూపీ)ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. 2008 నుంచి కాంగ్రెస్ ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీనికి దీటుగా ఎమ్మెన్‌ఎఫ్ సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఈడీపీ) పథకాన్ని తెరపైకి తెచ్చింది. బీజేపీ తరపున ఆ పార్టీ చీఫ్ అమిత్ షాయే నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే.. మెజారిటీలైన క్రైస్తవులను ఆకట్టుకునేలా ఆర్థిక విధానాలు ప్రకటించారు. హిందుత్వ ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ ఇద్దరు పాస్టర్లకు టికెట్లు ఇచ్చింది.