నాకు వ్యవసాయమంటే.. ప్రాణం

MLA Kale Yadaiah Political Life Store - Sakshi

‘అందరితో కలిసిమెలిసి.. అందరిలో ఒక్కడిగా ఉండటమంటేనే నాకు  ఇష్టం. నేను గొప్ప అనే భావన నాలో లేదు. కిందిస్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రజలతో అనుబంధం ఎక్కువ’ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చెప్పారు. వ్యవసాయం అంటే ప్రాణమని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా సమయం దొరికినప్పుడు పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తానని వెల్లడించారు. తన కుటుంబానికి సగం బలం తన భార్య జయమ్మ అని, ఆమెనే కుటుంబాన్ని చూసుకుంటుందన్నారు. యాదయ్య శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుటుంబ విషయాలను పంచుకున్నారు.
 

చేవెళ్ల: వికారాబాద్‌ జిల్లా నవాబుపే మండలం చించల్‌పేట గ్రామం మాది. అమ్మ లక్ష్మమ్మ, నాన్న మల్లయ్య. నాన్న రైల్వే ఉద్యోగి. మేము ఇద్దరం సోదరులం. తమ్ముడు సాయన్న ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ చనిపోయాడు. నేను 7వ తరగతి వరకు చించల్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. 8నుంచి 10వ తరగతి వరకు వికారాబాద్‌లో చదివి ఆ తర్వాత ఐటీఐ చేశాను. ఇంటర్‌ హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ కళాశాలలో చదివాను. డిగ్రీ డిస్‌కంటున్యూ చేశాను. ఐటీఐ చేయటంతో ఏపీఎస్‌ఆర్టీసీలో మోటర్‌ మోకానిక్‌గా అప్రెంటీస్‌గా పనిచేశాను. చదవుకునే సమయంలోనే 1980లో నాకు వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే. మేనత్త కూతురునే చేసుకున్నా.

అప్పటి వరకు చదువుకున్న చదువుతో ఏదైనా ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉండేవాడిని. కానీ, 1990లో మా తమ్ముడు  సాయన్న మరణించిన తరువాత గ్రామంలోనే ఉంటూ డీలర్‌గా పనిచేశాను. అప్పటి నుంచే రాజకీయంలోకి ప్రవేశించాను. అప్పట్లో వికారాబాద్‌ నియోజకవర్గంలో నవాబుపేట మండలం ఉండేది. ఆ నియోజకవర్గానికి ఎక్కువగా వలస నేతలే ఉండేవారు. దీంతో మన నియోజకర్గానికి మనమే నాయకులం కావాలనే ఆలోచన మొదలైంది. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే బీజం పడింది. పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా గెలిచి ఎమ్మెల్యే అయ్యాను. వికారాబాద్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావాలని 20 ఏళ్లు పోరాడాను. కానీ, 2009లో చేవెళ్ల నియోజకవర్గానికి దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఓడిపోయినా.. తరువాత రెండుసార్లు గెలిచాను. చదువుకునే రోజుల్లో కబడ్డీ, వాలీబాల్‌ బాగా ఆడేవాడిని.  
  
ప్రజాసేవలోనే నా జీవితం 
ని
యోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో సేవ చేయాలనేదే నా ఆలోచన. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవలోనే ఉన్నా. ఇక ముందు కూడా ఉంటా. కిందిస్థాయి నుంచి నాయకుడిగా ఎదిగా. అందుకే ప్రజల సమస్యలు ఏమిటో బాగా తెలుసు. యాదన్న అని పిలిస్తే పలుకుతా. నేను ఎమ్మెల్యేను.. నేను పెద్ద అని ఏనాడూ ఫీలవ్వలేదు. ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా.
   
కుటుంబ బాధ్యత నా భర్యే చూసుకుంటుంది 
నా భార్య జయమ్మ ఇంటర్‌ వరకు చదువుకుంది. ఇంటి బాధ్యతలన్నీ ఆమే చూసుకుంటుంది. పిల్లల చదువు అన్నీ ఆమే చూసుకునేది.  నాకు ముగ్గురు కుమారులు శ్రీకాంత్, రవికాంత్, చంద్రకాంత్, కూతురు ప్రియాంక. చిన్న కుమారుడు చంద్రకాంత్‌ వివాహం కావాల్సింది ఉంది. పిల్లలు పెద్దవారైనా ఇప్పటికీ స్వగ్రామంలోనే ఉంటున్నా.  

సాగుపై మక్కువ 
గ్రామంలో నాన్న వాటాగా వచ్చిన ఐదెకరాల భూమిని నేనే సాగు చేసుకుంటున్నా. అప్పట్లో నాన్న రైల్వే ఉద్యోగి కావటంతో వేరే వారికి కౌలుకు ఇచ్చే వారు. కానీ, నేను ఎమ్మెల్యే అయిన తరువాత వ్యవసాయంపై ఉన్న మక్కువతో నేనే సాగుచేసుకుంటున్నా. ఎమ్మెల్యేగా ఎప్పుడు బిజీగా ఉంటున్నా సమయం ఉన్నప్పుడాల్లా పొలానికి వెళ్లి పనులు చేస్తుంటాను. ఉదయం వాకింగ్‌ చేస్తూ కూడా పొలం వద్దకు వెళ్లి వస్తాను. చిన్నప్పటి నుంచి గ్రామంలోనే పుట్టి పెరిగినందుకు వల్ల అన్ని పనులు తెలుసు. గ్రామానికి సమీపంలోనే పొలం ఉండటంతో నేను లేనప్పుడు నా భార్య చూసుకుంటుంది. టమాట, మిర్చి, చిక్కుడు పంటలు సాగు చేస్తున్నాం. 

ఆయనకు ప్రజాసేవ ఎంతో ఇష్టం  
నా భర్త యాదయ్యకు రాజకీయలు అంటే ఎంతో ఇష్టం. పెళ్లి అయిన నాటినుంచి కూడా ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు.   అయినా, ఆయన కుటుంబాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. ఎన్ని పనులు ఉన్నా.. ఎంత దూరం వెళ్లినా.. రాత్రి వరకు తప్పని సరిగా ఇంటికి వచ్చేవారు. ఏదైనా అనుకోని పరిస్థితులు ఉంటే ఫోన్‌ చేసి చెప్పేవారు. కుటుంబ బాధ్యత నేనే చూసుకున్నా.. ప్రతి విషయం ఆయనకు చెప్పేదాన్ని. నా మాట ఎప్పుడూ కాదనే వారు కాదు.  పిల్లల చదువు, పెంపకంలో కూడా ఎక్కవగా నా బాధ్యతే ఉండేది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పూర్తిగా ప్రజల మధ్యనే ఉంటున్నారు.  ఎవరు వచ్చి పిలిచినా పలుకుతూ.. వారి కష్టాన్ని విని ఓదార్చాటం ఆయనకు ఉన్న మంచి గుణం. ఎవరి మనస్సూ నొప్పించరు. అందరికి అందుబాటులో ఉండాలనే ఆలోచనే ఎప్పుడు ఆయనకు ఉంటుంది. అవే ఆయనను ఎమ్మెల్యే స్థాయికి తీసుకువచ్చాయి.  – జయమ్మ, యాదయ్య భార్య 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top