మోదీ గొప్ప ఇంద్రజాలికుడు

Magician Modi Can Make Democracy Disappear says Rahul Gandhi - Sakshi

ప్రజాస్వామ్యాన్నీ మాయం చేయగలరు

ప్రధానిపై రాహుల్‌ తీవ్ర విమర్శలు

నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్న

జోవాయ్‌: దేశంలో ప్రజాస్వామాన్ని మాయం చేయగల గొప్ప ఇంద్రజాలికుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు పాల్పడినవారిని ఇక్కడ మాయం చేసి.. భారత చట్టాలు చేరుకోలేని చోటకు పంపటం మోదీ మ్యాజిక్‌ అని విమర్శించారు. బుధవారం మేఘాలయలోని జోవాయ్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు.

‘అప్రయత్నంగానే చాలా అంశాలను మోదీ తన చేతి వేళ్లతో కనిపించేటట్లు, మాయమయ్యేటట్లు చేయగల సమర్థుడు. కుంభకోణాలకు పాల్పడిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలు ఇక్కడ మాయమై విదేశాల్లో కనిపించడం.. అదీ మన చట్టాలు చేరుకోలేని చోటు కావడమే మోదీ మ్యాజిక్‌. త్వరలోనే ఆయన దేశం నుంచి ప్రజాస్వామ్యాన్నీ కూడా మాయం చేస్తారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అవినీతిని అంతమొందించలేదు కానీ.. అలాంటి కుంభకోణాలకు పాల్పడిన వారిని మాత్రం కనిపించకుండా చేయగలిగింద’ని రాహుల్‌ విమర్శించారు. జీవితంపై భరోసా కల్పించడం, భద్రత, ఆర్థిక అభివృద్ధిలోనూ ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు, ట్వీటర్‌ ద్వారా కూడా ప్రధానిపై రాహుల్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్‌బీ కుంభకోణం, రాఫెల్‌ ఒప్పందాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని ప్రశ్నించారు. వచ్చే మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌లో నీరవ్‌ మోదీ కుంభకోణం, రాఫెల్‌ ఒప్పందాల గురించీ మోదీ మాట్లాడాలన్నారు. ‘మోదీజీ మీ ఏకపాత్రాభినయ కార్యక్రమం మన్‌కీ బాత్‌లో గతనెల ఇచ్చిన సూచనలను మీరు విస్మరించారు. స్వీకరించలేనప్పుడు సూచనలు కోరటమెందుకు? ఈసారి మీ ఉపదేశాన్ని నేను వింటాను’ అని రాహుల్‌ ట్వీటర్‌ ద్వారా విమర్శించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top