డజన్‌ కొత్త ముఖాలు

In the Lok Sabha seats Most newcomers succeeded - Sakshi

ఐదుగురు పాతకాపులకే మళ్లీ అవకాశమిచ్చిన ఓటరన్న

విజేతల్లో ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఎన్నికల ఫలితాల్లో పన్నెండు మంది అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. పోటీచేసిన తొలిసారే పార్లమెంటులో అడుగిడే అవకాశం ల భించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా కొత్త వారే  విజయం సాధించారు. ఇందులో ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచినవారిలో మన్నెం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), బి.వెంకటేశ్‌ నేత (పెద్దపల్లి), పోతుగంటి రాములు (నాగర్‌కర్నూలు), డాక్టర్‌ రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. ఊహించ ని విధంగా పార్లమెంట్‌ పోరులో నిలబడ్డ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) జయకేతనం ఎగురవేయగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి) చివరి రౌండ్‌ వరకు ఉత్కంఠను రేకెత్తించినప్పటికీ విజయం సాధించారు.

సుదీర్ఘకాలం తర్వాత ఒంటరిగా పోటీచేసిన బీజేపీ అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. ఆ పార్టీ నలుగురు విజేతలూ మొదటిసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసినవారే కావడం విశేషం. గంగాపురం కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), సోయం బాపురావు (ఆదిలాబాద్‌), ధర్మపురి అరవింద్‌ (నిజామాబాద్‌), బండి సంజయ్‌ (కరీంనగర్‌) ఉన్నారు. వీరిలో ఉత్తమ్, కోమటిరెడ్డి, రాములు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించారు. కాగా, రేవంత్, కవిత, బాపురావు, కిషన్‌రెడ్డిలు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

ఐదుగురు పాతకాపులే!
ఐదుగురు పాతకాపులకు ఓటర్లు మళ్లీ పట్టం కట్టారు. గతంలో ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన వారికి మరోసారి అవకాశం కల్పించారు. అసదుద్దీన్‌ ఓవైసీ (హైదరాబాద్‌), నామా నాగేశ్వరరావు (ఖమ్మం), పసునూరి దయాకర్‌ (వరంగల్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌)లు తాజా ఎన్నికల్లోను విజయఢంకా మోగించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top