
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట వరంగల్ అర్బన్ జిల్లా నాయకుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల ఖరారు వ్యవహారంలో రాష్ట్ర బీజేపీకి అసంతృప్తుల సెగ అధికమైంది. బీజేపీ మొదటి జాబితా ప్రకటించినప్పటి నుంచే ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన వారి నుంచి నిరసన సెగ మొదలైంది. తాజాగా రెండో జాబితా ప్రకటనతో అది మరింత ఎక్కువైంది. ఇప్పటివరకు బీజేపీ రెండు దశల్లో 66 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అం దులో చాలా స్థానాల్లో టికెట్ పొందిన వారిని వ్యతిరేకిస్తూ అసంతృప్తి వర్గం ఆందోళనలకు దిగింది.
మొద టి జాబితాలో పరకాల నియోజకవర్గంలో విజయచందర్‌రెడ్డికి టికెట్ కేటాయించగా, అక్కడ టికెట్ ఆశిస్తున్న సంతోష్ పార్టీకి రాజీనామా చేసి, స్వతం త్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కోరుట్లలో మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ టికెట్ ఆశిస్తున్న వారుండగా, అమిత్‌షా నేతృత్వంలో జేఎన్ వెంకట్ పార్టీలో చేరిన వెంటనే టికెట్ లభించింది. దీంతో అక్కడి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫర్నిచర్ ధ్వంసం..
నిజామాబాద్ అర్బన్‌లో యెండల లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించగా అక్కడ టికెట్ ఆశిస్తున్న ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆందోళనకు దిగారు. ఆయన అనుచరులు నిజామాబాద్ పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. శేరిలింగంపల్లిలో టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నరేశ్‌లు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారమే అమరణ దీక్షకు దిగారు. శుక్రవారం వారి అనుచరులు పార్టీ కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వచ్చి బుజ్జగించి వారి దీక్ష విరమింపజేశారు.
బోథ్‌లో ఎం.రాజుకు టికెట్ కేటాయించగా, టికెట్ ఆశిస్తున్న విజయకుమార్ నిరసనకు దిగారు. తాండూరు టికెట్‌ను పటేల్ రవి శంకర్‌కు కేటాయించగా, అదే టికెట్ ఆశించిన వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ పార్టీకి రాజీనామా చేశారు. సిరిసిల్లలో మల్లగారి నర్సాగౌడ్‌కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నేతలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. వరంగల్‌లో వెస్ట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావును ఎంపిక చేయడం పట్ల అక్కడ టికెట్ ఆశిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నిరసన వ్యక్తం చేశారు.
శుక్రవారం రాత్రి ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో ఆయన నివాసంలో భేటీ అయిన అనంతరం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్మల్ స్థానాన్ని సువర్ణారెడ్డికి కేటాయించగా టికెట్ ఆశించిన మల్లికార్జున్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ టికెట్ తనకు ఇవ్వడం లేదన్న ముందస్తు సమాచారంతో ముందుగానే పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేశారు.
సంగారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా అదే కోవలో రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. సిద్దిపేటలోనూ స్థానిక కౌన్సిలర్ వెంకట్ నర్సింహ టికెట్ ఆశిస్తున్నా ఆయనకు ఇవ్వకుండా నాయిని నరోత్తంరెడ్డికి కేటాయించడంతో అలకబూనారు. మలక్‌పేట్, రాజేంద్రనగర్ స్థానాల్లో టికెట్లు ఆశించిన వారికి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.