
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ బాధితుల కష్టాలు తీర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దుబాయి, బొగ్గుబాయి, ముంబై వలస లుండవని పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడా విషయాన్నే పట్టించు కోవడం లేదని ఆరోపించారు. మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేరళ, పంజాబ్ తరహాలో ఐఆర్‌ఐ పాలసీ తీసుకొస్తానన్న హామీని సీఎం విస్మరించారన్నారు.
ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడే మృతి చెందిన పేదలు, తిరిగి వచ్చిన తర్వాత మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకర శర్మ, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నర్సింహనాయుడు, పలువురు గల్ఫ్ బాధితులు ఉన్నారు.