సాగర్‌ పంచాయితీ కొలిక్కి

ktr meets disagreements persons - Sakshi

అసమ్మతి నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

దేవరకొండ నేతలతోనూ సమావేశం

ఖైరతాబాద్‌ ఆశావహుల వినతులు

కేటీఆర్‌ను కలసిన విజయారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి

తమలో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో అసమ్మతులకు తెరపడుతోంది. నియోజకవర్గాల వారీగా అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్‌ బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గురువారం నల్లగొండ లో టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అసమ్మతి, అసంతృప్త నేతలతో బుధవారం కేటీఆర్‌ చర్చలు జరిపారు. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్‌ తన క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా సమావేశమయ్యారు.

నాగార్జునసాగర్‌ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య ను ప్రకటించడంపై అక్కడి స్థానిక నేత ఎంసీ కోటిరెడ్డి అసమ్మతికి తెరలేపారు. స్థానికులకే నాగార్జునసాగర్‌ టిక్కెట్‌ ఇవ్వాలని, పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే టీఆర్‌ఎస్‌ గెలవదని హెచ్చరించారు. సొంతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. నోముల విజ్ఞప్తి మేరకు కేటీఆర్‌ ఆ నియోజకర్గ నేతలను పిలిపించారు. 2 గంటల పాటు సమావేశయ్యారు. కోటిరెడ్డి, పలువురు ద్వితీయశ్రేణి నేతలు నాగార్జునసాగర్‌ నియోజకర్గంలోని పరిస్థితిని కేటీఆర్‌కు వివరించారు.  

నాలుగేళ్లుగా పట్టించుకోవట్లేదు..
నాలుగేళ్లుగా నోముల పార్టీని పట్టించుకోలేదని, ఇప్పుడు టికెట్‌ ఇస్తే ఆయన గెలిచే అవకాశం లేదని చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పార్టీ నేతలను పట్టించుకోవట్లేదని, తమ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ‘టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్ని పరిస్థితులను పూర్తిగా పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేశారు. నర్సింహయ్య గత ఎన్నికల్లోనూ నాగార్జునసాగర్‌లో పోటీ చేశారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ ఆయనకే అవకాశం ఇచ్చారు. సీనియర్‌ నేత నర్సింహయ్య గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలి.

మన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా మీరే స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తే ఎలా. అన్నింటికంటే పార్టీ ముఖ్యం. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుంది. అందరికీ అవకాశాలు ఉంటాయి. కలసి పని చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలి’అని కేటీఆర్‌ సూచించారు. అనంతరం నోముల నర్సింహ య్య, కోటిరెడ్డిలు కరచాలనం చేసుకున్నారు. కలసి పని చేస్తామని కోటిరెడ్డి ప్రకటించారు. దేవరకొండ లోని ద్వితీయశ్రేణి నేతల్లో కొందరు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రవీంద్రకుమార్‌పై అసంతృప్తితో ఉన్నారు. రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి మేరకు దేవరకొండ నేతలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అందరూ కలసి రవీంద్రకుమార్‌ను గెలిపించాలని సూచించారు.

ఖైరతాబాద్‌ తిరకాసు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సీట్ల కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం దానం నాగేందర్‌కు గోషామహల్‌ స్థానాన్ని ఖరారు చేసింది. ప్రచారం చేసుకోవాలని సూచించింది. అయితే దానం నాగేందర్‌ మాత్రం తనకు ఖైరతాబాద్‌ కేటాయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై దాదాపు రోజూ కేటీఆర్‌ను కోరుతున్నారు. దీనిపై కేసీఆర్‌ నిర్ణయిస్తారని కేటీఆర్‌ స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయినా దానం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, తమలో ఒకరికి ఖైరతాబాద్‌ టికెట్‌ ఇవ్వాలని ఈ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి బుధవారం కేటీఆర్‌ను కోరారు. దానం కూడా కేటీఆర్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థులను ప్రకటించని 14 స్థానాలపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top