1999 ఎన్నికలు: సామాజిక విభజనకు బీజం 

Kommineni Srinivasa Rao Social analysis on 1999 Elections - Sakshi

బలహీన వర్గాలకు పెద్దపీట

  రెడ్లు 31, బీసీలు 26, ఎస్సీలు 17 మంది గెలుపు 

1995లో తెలుగుదేశంలో జరిగిన తిరుగుబాటు ఫలితంగా ఎన్టీ రామారావు పదవి కోల్పోగా, ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 50 స్థానాలు వస్తే  కాంగ్రెస్‌ పార్టీకి  42 సీట్లు దక్కాయి. బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు 4,  సీపీఎం రెండు సీట్లు పొందాయి. ఒక ఇండిపెండెంట్‌ కూడా ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గంలో మొత్తం 31 మంది గెలిస్తే,  టీడీపీ నుంచి  పది మందే గెలిచారు. మిత్రపక్షమైన బీజేపీ టిక్కెట్‌పై మరో నలుగురు గెలుపొందారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి 17 మంది విజయం సాధించారు. ఒకరకంగా ఉమ్మడి ఏపీలో ఈ ఎన్నికల నుంచి సామాజిక విభజన బాగా పెరిగిందని చెప్పాలి.. వెలమ వర్గీయులు 12 మంది గెలిస్తే  ఏడుగురు టీడీపీ, నలుగురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి విజయం సాధించారు. కమ్మ ఎమ్మెల్యేలుగా ముగ్గురు ఎన్నికైతే ఆ ముగ్గురు టీడీపీ వారే. బీసీలలో 26 మంది గెలిస్తే, 12 మంది టీడీపీ, 10 మంది కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ముగ్గురు బీజేపీ వారు కాగా, ఒకరు సీపీఎం నుంచి ఎన్నికయ్యారు.
ముస్లింలు ఏడుగురు గెలుపొందితే ఎంఐఎం లో నలుగురు, టీడీపీ నుంచి ఒకరు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు. ఎస్సీలు 17 మందికిగాను 13 మంది టీడీపీ , నలుగురు కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఎస్టీలు ఎనిమిది మందికిగాను కాంగ్రెస్, టీడీపీల నుంచి చెరో ముగ్గురు, ఒకరు సీపీఎం, ఒకరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో రెడ్యానాయక్‌ జనరల్‌ సీటు నుంచి మరోసారి విజయం సాధించారు. ఇద్దరు బ్రాహ్మణులు గెలవగా, వారిలో ఒకరు కాంగ్రెస్, మరొకరు టీడీపీ వారు. వైశ్య వర్గం నుంచి ఒకరు కాంగ్రెస్‌ తరపున గెలిచారు. ఆయా వర్గాల వారీ గెలిచిన ప్రముఖులను పరిశీలిస్తే, కాంగ్రస్‌ నేతలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జి.గడ్డన్న, జీవన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గోవర్దనరెడ్డి, యు.పురుషోత్తంరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచినవారిలో పోచారం శ్రీనివాసరెడ్డి, ముద్దసాని దామోదరరెడ్డి, ముత్యంరెడ్డి, హరీశ్వర్‌ రెడ్డి మహేందర్‌ రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌ రెడ్డి ప్రభృతులు ఉన్నారు.

బీజేపీ నుంచి ఇంద్రాసేనారెడ్డి తదితరులు ఉన్నారు. వెలమ సామాజికవర్గం నుంచి గెలిచిన వారిలో సీబీఐ మాజీ డైరెక్టర్‌ కె.విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్‌లో పోటీచేసి పీజేఆర్‌ను ఓడించారు. గెలిచిన ఇతర ప్రముఖులలో కె.చంద్రశేఖరరరావు, ఎర్రబెల్లి దయాకరరావు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కమ్మ వర్గం నుంచి మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు మరోసారి గెలిచారు. ముస్లింలలో ఒవైసీ సోదరులు అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ ఉన్నారు. బీసీలలో దేవేందర్‌ గౌడ్, పి.చంద్రశేఖర్, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, నోముల నరసింహయ్య వంటి వారు ఉన్నారు. బ్రాహ్మణులలో దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కరణం రామచంద్రరావు ఉన్నారు. బీసీలలో అత్యధికంగా మున్నూరు కాపు వర్గం వారు 11 మంది గెలిచారు. గౌడ వర్గం వారు ఇద్దరు, ముదిరాజ్‌ ముగ్గురు ,యాదవ నలుగురు ఉన్నారు. ఎస్సీలలో బోడ జనార్దన్, బాబూ మోహన్, సుద్దాల దేవయ్య, పి.రాములు, కడియం శ్రీహరి, డాక్టర్‌ పి.శంకరరావు, మోత్కుపల్లి నరసింహులు ప్రభృతులు ఉన్నారు. కాగా కాంగ్రెస్‌ పక్షాన ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కొంతకాలానికి నక్సలైట్లు కాల్చి హత్య చేయడంతో  ఆయన భార్యను అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top