టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం

Komatireddy Raj Gopal Reddy Sensational Comments On Congress Party - Sakshi

కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ కుటుంబ పాలనను ఎదుర్కోవడం కమలానికే సాధ్యం

కనుచూపు మేరలో మరో పార్టీ కనిపించట్లేదు

కాంగ్రెస్‌ దుస్థితికి నాయకత్వ వైఫల్యమే కారణం

12 మంది ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కాపాడుకోలేకపోయారు

కుంతియా, ఉత్తమ్‌ పార్టీని సమన్వయపరచలేకపోయారు

బీజేపీలో చేరాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్య లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందని, పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశం కనిపించడం లేదని, అది మునిగిపోయే పడవని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ నియంతృత్వ ధోరణులను అడ్డుకోవాలంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ తప్ప మరొక పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్‌లో డిండి ప్రాజెక్టు నిర్వాసితులతో జరిగిన సమీక్ష సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు.
 
కుంతియా, ఉత్తమ్‌ ఫెయిల్‌... 
అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని మార్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకొని ఉండాల్సిందని రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా పార్టీని సమన్వయపరచలేక పోయారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయిందని, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే నాథుడే లేరని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా ఉత్తమ్‌ మాత్రం అలా ఆలోచించలేకపోయారని విమర్శించారు. 

కేసీఆర్‌ను ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదు... 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను, నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదని, కేసీఆర్‌ను, ఆయన కుటుంబ పాలనను ఢీకొట్టాలంటే ప్రధాని మోదీ వంటి నేతకే సాధ్యమని పేర్కొన్నారు. పీసీసీ సారథ్యాన్ని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అంతా అయిపోయింది’అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న అంశంపై మాట్లాడుతూ భువనగిరిలో కేవలం తమ కుటుంబ బ్రాండ్‌ ఇమేజ్‌ వల్లే గెలిచామని, కాంగ్రెస్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. నల్లగొండలో తామంతా కష్టపడ్డామని, అందుకే ఉత్తమ్‌ గెలిచారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పోటీలో ఉన్నామని, పార్టీ నాయకులు ఉత్తమ్, జానారెడ్డి వంటి వారు ఆ ఎన్నికను సీరియస్‌గా తీసుకోలేదని, అందుకే ఓడిపోయామన్నారు. 

కార్యకర్తలు, కుటుంబంతో మాట్లాడాకే పార్టీ మార్పుపై నిర్ణయం... 
బీజేపీలో చేరాలని తాను ఇంకా నిర్ణయించుకోలేదని, భవిష్యత్తులో ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే తమకు కృతజ్ఞత ఉందని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో బలపడటంలో మాత్రం కాంగ్రెస్‌ నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితిపై నాయకత్వం ఆలోచన చేయాలని, డీకే అరుణ వంటి నాయకులు బీజేపీలోకి ఎందుకు వెళ్లిపోయారో సమీక్షించుకోవాలని సూచించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top