ఉందామా, వెళ్లిపోదామా? 

Karnataka Congress rebel MLAs Secreat Meeting - Sakshi

కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేల రహస్య భేటీ  

రమేశ్‌ జార్కిహొళి నివాసంలో మంతనాలు  

మంత్రి పదవులు దక్కక తీవ్ర నైరాశ్యం  

హాజరైన బళ్లారి ల్లా ఎమ్మెల్యేలు  

సంకీర్ణ సర్కారులో అసమ్మతీయులు భావి కార్యాచరణపై మంతనాల్లో మునిగి తేలుతున్నారు. ఇక మంత్రి పదవులు దక్కవని ఖాయం కావడంతో ఏం చేయాలా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. తెగించి బీజేపీ శిబిరంలో చేరిపోదామా?, సర్ధుకుని ఇక్కడే ఉండిపోదామా? అనే సందిగ్ధంలోనూ ఉన్నట్లు సమాచారం.

సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ  మంత్రిమండలిలో చోటు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ సీనియర్లు ఉండాలా, వీడాలా? అనే అయోమయంలో పడ్డారు.  కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా జెండా మోసినా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బీజేపీలో చేరినా భవిష్యత్తు ఉంటుందా? అని మథనపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకోకతప్పదని నిశ్చయానికి వచ్చినట్లు సమాచారం. సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసమ్మతితో ఉన్నారు. మంత్రి పదవులు రాలేదని నామినేటెడ్‌ పోస్టులతో సర్దుకుపోవడమా?, బీజేపీలో చేరిపోవడమా? అని మరోదఫా తీవ్రంగా చర్చించారు.  

జార్కిహొళి నివాసంలో..  
కేబినెట్‌ విస్తరణ అనంతరం కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్తు ప్రణాళిక రచించేందుకు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో కాంగ్రెస్‌లోని సీనియర్‌ నాయకులు భగ్గుమంటున్నారు. శుక్రవారం రాత్రి వారందరూ భేటీ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా రహస్యంగా సమావేశమై భవిష్యత్తు ప్రణాళిక గురించి రచించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అసమ్మతి నేత, ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహొళి నివాసంలో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. జార్కిహోళి నివాసానికి శనివారం ఉదయం కూడా మస్కి ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్‌ వచ్చి మాట్లాడారు.  

వారే వస్తే ఆహ్వానిస్తాం: యడ్యూరప్ప  
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని తమకు లేదని ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. ఆ రెండు పార్టీల్లో  అసమ్మతి పెరిగి రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఆహ్వానిస్తామన్నారు. సీఎం కుమారస్వామికి వ్యతిరేకంగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి నిర్ణయం ఏ నిమిషంలో అయినా ప్రభుత్వానికి ప్రమాదమే అని చెప్పారు. వారంతట వారే బీజేపీలోకి వస్తే ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  

ఆవేదనలో సీనియర్లు 
కేబినెట్‌లోకి దారులు మూసుకుపోయాయని కాంగ్రెస్‌ సీనియర్లు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పార్టీకి కేటాయించిన బెర్తులన్నీ భర్తీ అయ్యాయి. తమకు చాన్స్‌ ఇవ్వాలంటే కొందరిని తొలగించి అసమ్మతి నేతలను చేర్చుకోవాలి. ఆ పని జరిగేనా? అని అనుమానంతో ఉన్నారు. ఎన్నాళ్లు ఇలా.. తొలగిస్తూ.. చేరుస్తూ పోవాలని.. పార్టీ పెద్దలు చొరవ తీసుకుని నియంత్రించాలని జేడీఎస్‌ నేత దేవెగౌడ ఇప్పటికే ప్రశ్నించారు.  

హాజరైంది వీరే  
శుక్రవారం రాత్రి అథణి ఎమ్మెల్యే మహేశ్‌ కుమటళ్లి భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ భేటీపై మీడియా ప్రతినిధులు సంప్రదించగా రమేశ్‌ జార్కిహోళి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. మహేశ్‌ కుమటళ్లి (అథణి), ప్రతాప్‌గౌడ పాటిల్‌ (మస్కి), నాగేంద్ర (బళ్లారి రూరల్‌), గణేశ్‌ (కంప్లి), ఆనంద్‌సింగ్‌ (హొసపేటె), సుధాకర్‌ (చిక్కబళ్లాపుర), బీకే సంగమేశ్‌ (భద్రావతి), బీసీ పాటిల్‌ (హిరేకరూరు) ఉన్నట్లు తెలిసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top