
సాక్షి, వైఎస్సార్ కడప : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి-రాజంపేట మీదుగా ఆయన కడపకు చేరుకున్నారు. కాగా, బీజేపీపై ఉన్న వ్యతిరేకతతో ఈ పర్యటనను అడ్డుకుంటారన్న సమాచారంతో సీపీఐ నేతలను ముందుస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పర్యటన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఓట్ల భయం పట్టుకుందని చెప్పారు.
ఎన్నికల్లో ఓడిపోతే చేసిన తప్పులు, అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడులు, తన చీకటి వ్యాపారం అంతా బయట పడతాయనే చంద్రబాబు బీజేపీ నేతలపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రజలు ఓట్లు వేయలేదని సైంధవుడిలా వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయిన గాలేరు నగరి-హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఏడాదికేడాదికి వాటి అంచనా వ్యయాలను పెంచుకుంటూ పోతూ కమీషన్లు దండుకుంటున్నారని ఏపీ సీఎంపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.