ఓటమి భయంతోనే కుమ్మక్కు రాజకీయాలు

Jagat Prakash Nadda comments on Chandrababu and KCR - Sakshi

కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్య

నేడు నగరానికి ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఓటమి భయంతోనే కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పేర్కొన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూసి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లాల్‌బహుదూర్‌ స్టేడియంలో సోమవారం(3న) నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయతో కలసి నడ్డా ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన సభల ద్వారా తమ విజయం దాదాపు ఖరారయిందన్నారు. మోదీ, అమిత్‌షాలు రాష్ట్రంలో అడుగుపెడుతుంటే చంద్రబాబు, కేసీఆర్‌ల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రజలను అయోమయానికి గురి చేసేలా ఉందన్నారు. మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పించని టీఆర్‌ఎస్‌ను ఏవిధంగా ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు.  

ఉనికి కోసమే చంద్రబాబు పాట్లు
టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ అస్థిత్వం కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని దత్తాత్రేయ విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు కచ్చితంగా ఓడిపోతార ని జోస్యం చెప్పారు. అందుకే ఆయన ఒకదాని కొకటి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ఎదుట తేలికవుతున్నారని, బాబు వ్యాఖ్యలు ఆయన పతనానికే దారితీస్తాయని చెప్పారు. బహిరంగ సభల్లో కేసీఆర్‌ మాటలు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top