ఎమ్మెల్సీ చాన్సెవరికి?

Huge Competitions For MLC Ticket In TRS - Sakshi

16 మండలి స్థానాలకు ఎన్నికలు.. అన్ని వర్గాలకు అవకాశమిచ్చేలా కేసీఆర్‌ కసరత్తు

ఏప్రిల్‌లోపు ప్రక్రియ పూర్తి

భారీగానే ఆశావహులు 

సిద్ధమైన జాబితా.. త్వరలోనే వెల్లడి

20న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్ల జాబితా

వెంటనే మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌

తర్వాత స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎన్నికలు  

సాక్షి, హైదరాబాద్‌ : రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌లో పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల భర్తీతోనే ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్‌లోపు 16 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకేసారి ఎక్కువ మందికి చట్టసభ పదవులు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటనతోపాటు పలు కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా అవకాశం రాని వారికి చైర్మన్‌ పదవులు ఇచ్చేలా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కోటా 14, స్థానిక సంస్థల కోటా 14, గవర్నర్‌ కోటాలో 6, ఉపాధ్యాయుల కోటాలో 3, పట్టభద్రుల కోటాలో 3 స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకోసారి మూడింట్లో రెండో వంతు స్థానాలు ఖాళీ అవుతాయి. ఇలా మార్చిలో సాధారణంగా తొమ్మిది స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇటీవల ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీల పదవులు రద్దయ్యాయి. దీంతో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ అవుతున్న మిగిలిన స్థానాలు కలిపితే ఈ సంఖ్య 16కు చేరింది. ఖాళీ అయిన, అవుతున్న వాటిలో ఎమ్మెల్యేల కోటా 7, స్థానిక సంస్థల కోటా 5, ఉపాధ్యాయుల కోటా 2, పట్టభద్రుల కోటా 1, గవర్నర్‌ కోటాలో 1 ఉన్నాయి.  

ఫిబ్రవరి 20న షెడ్యూల్‌ 
ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20న వెల్లడించనుంది. జాబితా వచ్చిన రెండు మూడ్రోజుల్లోపే ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. అనంతరం స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఒకేసారి భారీగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండడంతో టీఆర్‌ఎస్‌లో ఈ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పని చేస్తూ ఎలాంటి పదవులు దక్కనివారు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాని వారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరంతా మనసులో ఉన్న కోరికను చెప్పుకునేందుకు సీఎంను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాత్రం ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణల ఆధారంగా ఖాళీ అయ్యే అన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితాను రూపొందించారు. ఆశావాహులు మాత్రం జాబితా ప్రకటించే వరకు అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీటితోపాటు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా ఒకరి పేరును ప్రభుత్వం తరుపున గవర్నర్‌కు సిఫారసు చేయనున్నారు. అందరు అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారా? దశల వారీగా ప్రకటిస్తారా అనేది ఆశావాహులలో ఆసక్తికరంగా మారింది. 
 
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌ (టీఆర్‌ఎస్‌) పదవీకాలం మార్చితో ముగుస్తోంది. శాసనమండలి చైర్మన్‌గా ఉన్న స్వామిగౌడ్‌ మళ్లీ ఈ స్థానంలో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగానీ, లోక్‌సభకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దీంతో ఈ నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ ఎక్కువగానే ఉంది. గ్రూప్‌–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, సరోజినిదేవీ కంటి ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ రవీందర్‌గౌడ్, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. 
 
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. ఆయనకే మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్‌ (స్వతంత్ర) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. పూల రవీందర్‌ టీఆర్‌ఎస్‌కు అనుబంధంగానే ఉన్నారు. దీంతో పూల రవీందర్‌ ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్‌ అభ్యర్థిత్వాలపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం త్వరలోనే ప్రకటన చేయనుందని సమాచారం. 
 
స్థానిక సంస్థల కోటాలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు (టీఆర్‌ఎస్‌) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు అందరికీ సీఎం కేసీఆర్‌ మరోసారి అవకాశం ఇస్తామన్నారు. ప్రభాకర్‌రావుకు సైతం మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయం కానుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం, పార్టీ ఫిరాంపులతో సభ్యత్వం రద్దు కారణంగా వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల కోటాలో మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వరంగల్‌ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిత్వం కోసం తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా స్థానం కోసం మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, క్యామ మల్లేశ్‌ పోటీ పడుతున్నారు. నల్లగొండ స్థానిక సంస్థల స్థానం నుంచి తేరా చిన్నపరెడ్డి, చకిలం అనిల్‌కుమార్‌ పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇక్కడ పరిశీలిస్తోంది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల సీటు కోసం దాదన్నగారి విఠల్‌ రావు, ఏఎస్‌ పోశెట్టి ప్రయత్నిస్తున్నారు. 
 
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోంమంత్రి మహమూద్‌ అలీ, మహమ్మద్‌ సలీం, టి.సంతోష్‌కుమార్, మహమ్మద్‌ షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో, కె.యాదవరెడ్డి అనర్హత వేటు వేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు ఎమ్మెల్యే కోటా స్థానాలే. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబీలో 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో స్థానానికి 17 మంది చొప్పున ఎమ్మెల్యేల ఓటు అవసరం అవుతుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. మిగిలిన ఆరు స్థానాలు టీఆర్‌ఎస్‌ సులభంగా గెలచుకోనుంది. మంత్రి మహమూద్‌ అలీ, మహమ్మద్‌ సలీంలకు కచ్చితంగా కొనసాగింపు ఉంటుంది. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన టి.సంతోష్‌కుమార్‌కు సైతం మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌కు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఎమ్మెల్యేల కోటాలోనే ఇవ్వనున్నారు. ఈ కోటాలో మిగిలిన రెండు స్థానాల కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top