రాహుల్‌పై హర్ధిక్‌ సంచలన వ్యాఖ్యలు

Hardik Patel Sensational Comments on Rahul Gandhio - Sakshi

సాక్షి, ముంబై : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై పటీదార్‌ ఉద్యమ నేత హర్ధిక్‌ పటేల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో రాహుల్‌ నాయకుడే కాదని తెలిపాడు. అదే సమయంలో రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ హర్ధిక్‌ ఆహ్వానిస్తున్నాడు.

‘ ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్‌ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. కానీ, అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా అభిప్రాయం’ అని శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన హర్ధిక్‌ పేర్కొన్నాడు.

ఇక 2019 ఎన్నికల్లో పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్‌) తరపున పోటీ చేయబోనని హర్ధిక్‌ స్పష్టం చేశాడు. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హర్ధిక్‌ పోటీ చేయలేదు. 24 ఏళ్ల హర్ధిక్‌కు వయోపరిమితి( పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలి) కారణంగానే దూరంగా ఉన్నాడని.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన హర్ధిక్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తననెవరూ అడ్డుకోలేరని చెబుతూ.. ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top