తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ విచారణకు సిద్ధమా?

Gudivada Amarnath questioned on TDP leaders corruption - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీ కేబినెట్ మంత్రులు, టీడీపీ నేతలు విశాఖ జిల్లాలో భారీగా భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. జిల్లాలోని విలువైన భూములను దోచుకుని తిరుగుతున్నా ప్రత్యేక విచారణాధికారుల బృందం (సిట్) అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ భూకుంభకోణాలపై విచారణకు తాము సిద్ధమని వైఎస్ఆర్‌సీపీ పదే పదే చెబుతున్నా టీడీపీ ముందుకు రాకపోవడం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆయన ఇక్కడి మీడియాతో మంగళవారం మాట్లాడుతూ జిల్లాలో జరుగుతోన్న భూకుంభకోణాలను వివరించారు. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో  అడ్డంగా దొరికిపోగా ఏం చెప్పాడో అందరికీ తెలుసునన్నారు. సెక్షన్‌ 8 అమలు చేయాలని, మీకు ఏసీబీ ఉంటే.. మాకు ఏసీబీ ఉందని వ్యాఖ్యలు చేసినట్లు గుర్తుచేశారు.

సీఎం చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు భారీగా భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విశాఖలో భూఅక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేసి దాదాపు ఏడు నెలలు కావస్తున్నా పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కేబినెట్‌ ఉన్న మంత్రులు విశాఖలో భారీగా భూకుంభకోణాలకు పాల్పడుతున్నా.. సంక్రాంతికి అల్లుళ్లు వచ్చినట్లుగా సిట్ వచ్చి వెళ్తోందని.. 7 వేలకు పైగా కేసులు నమోదైనా, అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్క వ్యక్తి మీద చర్య తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదైతే ఏం చర్య తీసుకున్నారు? ఏదో ఓ కేసులో మాత్రం డిప్యూటీ ఎమ్మార్వో, మరో ప్రభుత్వ ఉద్యోగిని నామమాత్రంగా అదుపులోకి తీసుకున్నారు.

గుడివాడ అమర్‌నాథ్ ప్రస్తావించిన మరిన్ని అంశాలివే..

  • 1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచీ భూకుంభకోణాలపై విచారణకు తాము సిద్ధమని వైఎస్ఆర్‌సీపీ సవాల్ విసిరినా టీడీపీ ముందుకు రాకపోవడం దారుణం.
  • 2016, నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తే దేశంలో ఎక్కడాలేని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఏపీ మంత్రుల వద్దకు అదే సమయంలో అంతడబ్బు ఎలా వచ్చింది
  • దాదాపు 80 మంది డబ్బు చేతిలో లేక ప్రాణాలు విడవగా.. టీడీపీ నేతలతో వేలకోట్లు ఉండటం నిజం కాదా?
  • విశాఖకు చెందిన మంత్రి ఇండియన్ బ్యాంకుకు రూ. 175 కోట్లు టోపీ పెట్టారని ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం మంత్రి తీసుకున్న డబ్బు ఎవరికి బదిలీ చేశారన్న వివరాలు వెల్లడించలేదు
  • సీబీఐ ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. అవకతవకలు జరిగాయని ఈ కేసుపై ఏపీ చీఫ్ సెక్రటరీకి సీబీఐ ఎస్పీ లేఖ రాశారు.
  • కానీ గత నెల (నవంబర్‌)లో ఆర్టీఐకి కేసు వివరాల కోసం లేఖ రాస్తే.. తమకు ఎలాంటి లేఖ రాలేదని చీఫ్ సెక్రటరీ చెప్పారని ఆర్టీఐ ద్వారా బదులు వచ్చింది. అంటే అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు రుజువైంది
  • అవినీతి, భూకబ్జాలు, భూకుంభకోణాలకు పాల్పుడుతోన్న టీడీపీ నేతలు ఆ తప్పులను వైఎస్ఆర్‌సీపీ నేతలపై నెట్టివేసే ప్రయత్నం చేయడం నిజం కాదా?
  • పెందూర్తి నియోజకవర్గం సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూకుంభకోణాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top