పోటీపై సందిగ్ధంలో మాజీ ప్రధాని..!

Former PM Manmohan Singh Not Interest To Contest Sources - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (86) సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయవల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సునీల్‌ జెక్కర్‌ ఆయనను కోరారు. ఈ మేరకు న్యూఢిల్లోని మన్మోహన్‌ నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. వారి అభ్యర్థనపై మాజీ ప్రధాని స్పందిస్తూ.. వయసు, ఆరోగ్యం అనుకూలించకపోవడంతో పోటీ చేయలేనని వారితో చెప్పినట్లు తెలుస్తోంది. కీలకమైన  ఎన్నికలు కావడంతో ప్రచారం చేసే ఒపిక కూడా తనకు లేదని, ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపినట్లు సమాచారం.

ప్రచారానికి సంబంధించిన విషాయాలన్నీ తాను దగ్గరుండి చూసుకుంటానని, అమృత్‌సర్‌లో పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తారని మన్మోహన్‌కు అమరిందర్‌ వివరించారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన అనంతరం పోటీపై తుది నిర్ణయం తీసుకుంటానని మన్మోహన్‌ తెలిపారు. కాగా రిజర్వ్ బ్యాంక్‌ గవర్నర్‌గా, పీవీ నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా  సేవలందించిన  మన్మోహన్‌ అనంతరం అనూహ్యంగా ప్రధాని పదవిని చేపట్టి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

జూన్‌తో మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను పోటీ చేయించాలని పార్టీ నాయకత్వం కూడా భావిస్తోంది. మన్మోహన్‌తో భేటీ అనంతరం కెప్టెన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్‌తో పొత్తు అవసరం లేదని ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top