కమలంలో కలకలం

Flex banner Issues in BJP Party Hyderabad - Sakshi

బీజేపీలో రచ్చకెక్కిన విభేదాలు

లష్కర్‌లో ఫ్లెక్సీల చించివేత కేసు నమోదు

సికింద్రాబాద్‌/చిలకలగూడ: భారతీయ జనతా పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో నాయకుడు చించేయడం ఇందుకు కారణమైంది. ఈ వ్యవహారం పోలీసు కేసుల వరకు వెళ్లింది. అసలే అంతంతమాత్రం కేడర్‌ కలిగిన పార్టీలో ఉన్న కొద్దిపాటి నాయకులు బజారున పడి ఫ్లెక్సీలు చించుకోవడం పట్ల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తొలిసారి నగరానికి వస్తున్న సందర్భంగా చిలకలగూడ కూడలి నుంచి వారాసీగూడ వరకు గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బండపల్లి సతీష్‌కుమార్‌ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

సదరు ఫ్లెక్సీల్లో తన ఫొటో లేదన్న కారణంగా సికింద్రాబాద్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి రవిప్రసాద్‌గౌడ్, అతడి కుమారుడు సాయిగౌడ్‌ ఫ్లెక్సీలను కొడవళ్లతో చించేశారని బండపెల్లి సతీష్‌ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన అంతు తేలుస్తానని రవిప్రసాద్‌ బెదిరించినట్లు సతీష్‌ ఆరోపించారు. సాంకేతిక కారణాలతో అతడి ఫొటోను ఫ్లెక్సీలో పెట్టలేకపోయామని అంతమాత్రాన ఫ్లెక్సీలను చించివేయడం తగదన్నారు. కాగా గత ఎన్నికల్లో బండపెల్లి సతీష్‌కు పూర్తి సహకారం అందించానని  రవిప్రసాద్‌గౌడ్‌ పేర్కొన్నాడు.  సీనియర్‌ నాయకుడైన తన ఫొటోను ఫ్లెక్సీలో లేనందునే వాటిని చించివేసినట్లు తెలిపారు. తన ఇల్లు, కార్యాలయం ముందు తన ఫొటోలు లేని ఫ్లెక్సీలను కట్టిన బండపల్లి సతీష్‌ అనుచరులు తమను రెచ్చగొడుతున్నారన్నారు. బండపెల్లి సతీష్‌ ఫిర్యాదు మేరకు రవిప్రసాద్‌గౌడ్, సాయిప్రసాద్‌గౌడ్, సందీప్, ఉపేందర్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top