తొలి నిర్ణయం మెగా డీఎస్సీనే | First Decision On Mega DSC Said By Raja Narsimha | Sakshi
Sakshi News home page

తొలి నిర్ణయం మెగా డీఎస్సీనే

Sep 23 2018 12:51 AM | Updated on Mar 18 2019 9:02 PM

First Decision On Mega DSC Said By Raja Narsimha - Sakshi

దామోదర రాజనర్సింహ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నిర్ణయం మెగా డీఎస్సీనే ఉంటుందని, 20 వేల టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తామని టీ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కమిటీ తొలి సమావేశం అనంతరం సభ్యులు ఆబిద్‌ రసూల్‌ ఖాన్, మల్‌రెడ్డి రంగారెడ్డి, విజయ్, ఇందిరాశోభన్‌ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల కోసం ప్రజల మేని ఫెస్టో తయారు చేస్తామని, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వివిధ ప్రభు త్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.2 లక్షలు, ఖాళీ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు యూనిట్‌కు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, 200 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్, బీపీఎల్‌ కుటుంబాల్లో మనిషికి 7 కేజీల సన్నబియ్యం, 9 రకాల నిత్యావసరాల అందజేత లాంటి హామీలన్నింటినీ మేనిఫెస్టో కమిటీ ఆమోదించిందని చెప్పారు. అవే కాకుండా మరో 50–60 అంశాలపై అధ్యయనం చేస్తున్నామని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌–టీచింగ్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. కౌలు రైతులను ఆదుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రైతు బంధు తరహాలోనే.. అంతకన్నా మెరుగైన పథకాన్ని రైతుల కోసం తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 16వేల మంది జర్నలిస్టులకు కూడా న్యాయం చేస్తామని ఆయన వెల్లడించారు.  

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి... 
అంతకుముందు జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అంటే ఒక నమ్మకమని, ఒక హామీ ఇచ్చామంటే అమలు చేస్తామనే విశ్వాసం ప్రజలకు కలగాలని, ఆర్థికంగా, సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా, అమలు చేసేందుకు అవకాశం ఉన్న హామీలనే మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. తొలి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం, శ్రీనివాస కృష్ణన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కమిటీ కన్వీనర్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కాగా, జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో విరాహత్‌ అలీ, తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరుఫున గంగు భానుమూర్తి తదితరులు రాజనర్సింహను కలసి తమ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలని వినతిపత్రాలు అందజేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement