చంద్రబాబు జిమ్మిక్కులకు ఈసీ ఝలక్‌

EC Rejects Praja Shanti Candidate Nomination - Sakshi

సాక్షి, గుంటూరు : ప్రజలను అయోమయానికి గురిచేసి.. ప్రతిపక్ష పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మిక్కులకు ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు నంబూరు శంకరరావు కాగా.. ఓటర్లను అయోమయానికి గురిచేసే ఉద్దేశంతో ఇక్కడ ప్రజాశాంతి పార్టీ నంబూరి శంకరరావు అనే పేరు గల మరో వ్యక్తిని నిలబెట్టింది. అయితే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల కమిషన్‌ మంగళవారం తిరస్కరించింది. నామినేషన్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. దరఖాస్తును అభ్యర్థి సరిగ్గా పూర్తి చేయకపోవడంతో నిబంధనల మేరకు తిరస్కరించారు. దీంతో ఓటర్లను తికమక పెట్టేందుకు టీడీపీ వేసిన ఎత్తుగడ విఫలమైంది. కాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు.

ఒక పెదకూరపాడే కాకుండా మరో ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను కలిగివున్న వ్యక్తులను పోటీలోకి దించారు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్‌ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్‌ రెక్కలు వైఎస్సార్‌సీపీ సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తును పోలి ఉండటం... ఇక ఆ పార్టీ జెండా రంగులు కూడా వైఎస్సార్‌సీపీ జెండా రంగులను పోలి ఉండటంతో చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ప్రజాశాంతి పుట్టుకొచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. ఈ రెండు అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top