ఆ ఇద్దరి ‘రూటు’ సెపరేటు...

Dasoju Sravan Rejects Gunmens - Sakshi

గన్‌మెన్‌లను వద్దన్న దాసోజు శ్రవణ్‌

షహజాదికి మాత్రం 2+2 కేటాయింపు

ఆపై పరిస్థితుల్లో ఒకరి ఉపసంహరణ

గుర్తింపు పార్టీల అభ్యర్థులకు పీఎస్‌ఓలు

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పోలీసు విభాగం బరిలో నిలిచిన కీలక పార్టీల అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత అధికారులను (పీఎస్‌ఓ) కేటాయించింది. నగరంలోని 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారికి కొన్ని రోజుల క్రితమే పీఎస్‌ఓలను నియమించింది. అయితే ఖైరతాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ బీజేపీ అభ్య
ర్థిని షహజాది మాత్రం ఈ కేటాయింపుల్లో తమకంటూ ప్రత్యేకత కలిగి ఉన్నారు. తనకు గన్‌మెన్‌ వద్దంటూ తిప్పిపంపిన ఒకే ఒక్క అభ్యర్థి శ్రవణ్‌ కాగా... తొలిసారిగా అందరి కంటే ఎక్కువ భద్రత పొందిన అభ్యర్థినిగా షహజాది రికార్డుకు ఎక్కారు.

గుర్తింపు పార్టీల అభ్యర్థులకే...   
ప్రతి ఎన్నికల సందర్భంలోనూ అనేక మంది పోటీ చేస్తుంటారు. ఈసారి విషయానికే వస్తే హైదరాబాద్‌ జిల్లాలో 313 మంది, మేడ్చల్‌లో 132 మంది, రంగారెడ్డిలో 127 మంది పోటీలో ఉన్నారు. ప్రతి అభ్యర్థి వెంట అనునిత్యం ఓ గన్‌మెన్‌ ఉండే లా 1+1 భద్రతకల్పిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే రాష్ట్ర అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేల సంఖ్యకు రెట్టింపునకు పైగా ఉన్నారు. ఈ 313 మందికి భద్ర త కల్పించాలంటే 626 మంది గన్‌మెన్‌లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం గుర్తిం పు పార్టీల అభ్యర్థులకు మాత్రమే పీఎస్‌ఓలను కేటాయించాలనే నిబంధన పొందుపరిచారు. సిటీలో పోటీలో నిల్చున్న తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఎలానూ భద్రత ఉంది.వీరితో పాటు పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్, ప్రజాకూటమి, బీజేపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులకు  గన్‌మెన్‌లను కేటాయించారు.   

ఆ ఇద్దరి ‘రూటు’ సెపరేటు...
నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే బరిలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది ఖరారైంది. ఆపై ఈసీ రూపొందించిన జాబితా ప్రకారం పోటీలో ఉన్న గుర్తింపు పార్టీల అభ్యర్థులకు నగర పోలీసులు గన్‌మెన్‌లను కేటాయించారు. మిగిలిన అభ్యర్థుల వెంట వీరు కొనసాగుతున్నా... ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌ మాత్రం తనకు ఈ భద్రత అవసరం లేదని భావించారు. ఈ నేపథ్యంలో తనకు
పీఎస్‌ఓల కేటాయింపు వద్దని లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తూ కేటాయించిన వారిని వెనక్కు పంపారు.

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీలో నిలిచిన షహజాది మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పరిస్థితులు, ఆదిలోనే ఎదురైన అనుభవాల నేపథ్యంలో సిటీ పోలీసులు తొలుత ఆమెకు అనునిత్యం ఇద్దరు పీఎస్‌ఓలు వెంట ఉండేలా 2+2 భద్రత కల్పించారు. వీరిలో ఇద్దరు మహిళా పీఎస్‌ఓలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగాసమీక్షించి 1+1కు కుదించడానికి నిర్ణయంతీసుకున్నారు.  

‘అవసరమైతే’ అభ్యర్థించాల్సిందే...
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఇతర అభ్యర్థుల్లో ఎవరైనా తమకు గన్‌మెన్ల అవసరం ఉందని భావిస్తే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) లేదా నగర పోలీస్‌ కమిషనర్‌కు తన దరఖాస్తు సమర్పించాలి. అందులో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని పరిస్థితులతో పాటు ఎందుకు పీఎస్‌ఓలను కోరుతున్నామో సవివరంగా పొందుపరచాలి. ఆర్‌ఓలకు చేరిన దరఖాస్తులు సైతం పోలీసుల వద్దకే వస్తాయి. దీన్నిఅన్ని కోణాల్లోనూ సమీక్షించే ప్రత్యేక కమిటీ భద్రత అవసరం అనుకున్న వారికి గన్‌మెన్‌లను కేటాయిస్తుంది. అయితే అనేక మంది అభ్యర్థులు ఈ తంతు ఎందుకు అనుకుంటున్నారో..! లేక పీఎస్‌ఓల ద్వారా తమ సమాచారం లీక్‌ అవుతుందని భావిస్తున్నారో కానీ అవసరం ఉన్నా దరఖాస్తు చేయట్లేదు. వీలున్నంత వరకు అభ్యర్థులు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని, వారికి సఫారీ డ్రెస్‌ వేసి తమ వెంట తిప్పుకుంటూ సంతృప్తిచెందుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top