సీపీఐ కొత్త సారథి డి.రాజా

D Raja to take over as CPI general secretary replacing Sudhakar Reddy - Sakshi

ఆరోగ్య సమస్యలతో వైదొలిగిన సురవరం

సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సురవరం సుధాకర్‌రెడ్డి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం సీపీఐ జాతీయ సమితి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ, జాతీయ సమావేశాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ ప్రధానకార్యదర్శిగా పార్టీ అత్యున్నత బాధ్యతలను సురవరం సుధాకర్‌రెడ్డి నుంచి డి.రాజా స్వీకరిస్తారు. పార్టీ అత్యున్నత పదవి కోసం డి.రాజాతో పాటు సీనియర్‌ నేతలు అతుల్‌ కుమార్‌ అంజాన్, అమర్‌జిత్‌ కౌర్‌ పేర్లను నాయకత్వం పరిశీలించింది.

తమిళనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న రాజా రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగియనుంది. దళిత వర్గ నేతగా, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉండడంతో జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల అగ్రనేతలతో ఆయనకు పరిచయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొత్త రక్తం నింపడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే వ్యూహంలో భాగంగానే రాజా వైపు జాతీయ సమితి మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుపొందడంతో పాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, క్రియాశీలంగా మార్చడం వంటివి రాజాకు సవాళ్లేనని పరిశీలకులు అంటున్నారు.

సురవరం ఎందుకు వైదొలిగారంటే..
ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం సుధాకర్‌ రెడ్డి(77) కోరినట్టు పార్టీ వర్గాల సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల వరకే పదవిలో ఉంటానని పార్టీకి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ›ప్రధాన కార్యదర్శిగా 2012లో బాధ్యతలను చేపట్టిన సురవరం, వరసగా మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2021 వరకు ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top