చంద్రబాబుతో కలిసి తిరగడం ఏంటి?

CPI High Command Furious on Ramakrishna - Sakshi

వికేంద్రీకరణకు సై అంటూనే బాబు పన్నిన ఉచ్చులో చిక్కుకుంటారా?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిపై పార్టీ నాయకత్వం ఆగ్రహం

సాక్షి, అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీరుపై ఆ పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. సాక్షాత్తూ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులే ఆయన వైఖరిని తప్పుపడుతున్నారు. కార్యవర్గం చేసిన తీర్మానాలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటని ఆక్షేపించారు. వామపక్షాల ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమదూరం పాటించాలన్న నిర్ణయాన్ని తుంగలో తొక్కి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఇటీవల జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో నేతలు తప్పుపట్టారు. రామకృష్ణ ఇటీవల చంద్రబాబుతో కలిసి జోలెపట్టి ఊరూరా తిరగడాన్ని ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడొకరు బాహాటంగానే విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు సై అంటూనే చంద్రబాబు పన్నిన ఉచ్చులో ఇరుక్కోవడం ఏమిటని నిలదీశారు. పార్టీపరంగా ఆందోళన చేయాలనుకుంటే మిగతా వామపక్షాలతో కలిసి వెళ్లాలేగానీ, బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న టీడీపీతో కాదని తేల్చిచెప్పారు. పలు జిల్లాల కార్యవర్గాలు సైతం రామకృష్ణ తీరుపై మండిపడ్డాయి. రామకృష్ణ ఏ వర్గ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారో చెప్పాలని సీపీఐ నేతలు ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణతో తమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నాయకులు తెగేసి చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసమా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో జత కట్టి, ఎన్నో కొన్ని సీట్లు రాబట్టాలన్న తాపత్రయంతో తమ నాయకుడు రామకృష్ణ చంద్రబాబుతో సత్సంబంధాలు నెరుపుతున్నట్టు సీపీఐ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదన్న సాకుతో చంద్రబాబు గతంలో అఖిలపక్ష సమావేశానికి సీపీఐని ఆహ్వానించలేదని గుర్తుచేశారు. బాబుతో చెలిమి వల్ల తమ పార్టీకి వీసమెత్తు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రామకృష్ణ చొరవతో గతంలో పవన్‌ కల్యాణ్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని చేతులు కాల్చుకున్న వైనాన్ని సీపీఎం నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. రాజధాని వ్యవహారంలో చంద్రబాబుది కపట నాటకమని ఓ పక్క చెబుతూనే మళ్లీ ఆయనతో కలిసి ఉద్యమమేమిటని మిగతా వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top