10 రోజుల్లో రైతు రుణమాఫీ

Congress will waive off loans of Chhattisgarh farmers - Sakshi

అధికారంలోకొస్తే అమలు చేస్తాం

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌గాంధీ హామీ

పఖన్‌జోర్‌/రాజ్‌నందన్‌గావ్‌: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే 10 రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  ప్రకటించారు. రైతులకు బోనస్‌ ఇస్తామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా పఖన్‌జోర్, సీఎం సొంత నియోజకవర్గం రాజ్‌నందన్‌గావ్‌లలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ ఈ హామీలిచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం రమణ్‌ సింగ్‌కు పారిశ్రామిక వేత్తలే దగ్గరి స్నేహితులంటూ రాహుల్‌∙విమర్శించారు.

‘ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లకు స్నేహితులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలే ఈ ప్రాంతంలోని అపార సహజ వనరులతో లాభపడుతున్నారు’ అని ఆరోపించారు. ‘జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) అమలుతో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. నల్లధనం వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు కష్టాలకు గురయ్యారు’ అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, రమణ్‌సింగ్‌ ఇద్దరూ బహిరంగంగానే అవినీతిలో కూరుకుపోయారన్నారు.

నానమ్మ ఎన్నో నేర్పారు
ఈ సందర్భంగా రాహుల్‌ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఇందిరాగాంధీజీ నాకు ఎన్నో విషయాలు నేర్పారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాల కోసం కృషి చేయాలనేది ఆమె కోరిక. ఆ మేరకు అణగారిన, బలహీన వర్గాల పక్షాన నిలబడతా. వారి హక్కుల కోసం పోరాడుతా. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె కృషి వల్లనే బెంగాలీలు బస్తర్‌ ప్రాంతానికి వలస వచ్చారు’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో జరిగిన రూ.5వేల కోట్ల చిట్‌ఫండ్‌ కుంభకోణం ఫలితంగా ఎందరో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. 

అయినప్పటికీ, ఏ ఒక్కరిపైనా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఎందుకు? ఆ చిట్‌ఫండ్‌ కంపెనీలన్నీ రమణ్‌సింగ్‌ స్నేహితులవి’ అని రాహుల్‌ ఆరోపించారు. పనామా పత్రాల కుంభకోణంతో సంబంధమున్న పాక్‌ మాజీ ప్రధాని షరీఫ్‌ జైలు శిక్ష అనుభవిస్తుండగా, అదే కేసులో ఆరోపణలున్న సీఎం కొడుకు అభిషేక్‌పై ఎలాంటి చర్యలు లేవు’ అని అన్నారు. మరోవైపు, రాహుల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో ‘జన్‌ ఘోషణా పత్ర’ విడుదల చేశారు. ఇందులో రైతు రుణమాఫీతోపాటు  స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top